రుణాలు తీర్చాల్సిన బాధ్యత టెల్కోలదే: కేంద్ర మంత్రి వైష్ణవ్‌

13 Jan, 2022 07:25 IST|Sakshi

న్యూఢిల్లీ: వడ్డీ బాకీలకు ప్రతిగా ప్రభుత్వానికి వాటాలు ఇచ్చినప్పటికీ అసలు మొత్తాన్ని తీర్చాల్సిన బాధ్యత టెల్కోలపైనే ఉంటుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ‘ఆయా సంస్థల్లో ప్రభుత్వం ఇన్వెస్టరుగా మాత్రమే ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోదు. తగిన సమయంలో ప్రభుత్వం నిష్క్రమిస్తుంది. కంపెనీలు ప్రొఫెషనల్స్‌ సారథ్యంలోనే నడుస్తాయి. బాకీలు తీర్చాల్సిన బాధ్యత వాటిపైనే ఉంటుంది‘ అని ఆయన తెలిపారు. 

రాబోయే వేలంలో సదరు కంపెనీలు స్పెక్ట్రం కొనుగోలు చేస్తే.. వాటిలో వాటాదారుగా, అవి జరపాల్సిన చెల్లింపుల భారాన్ని ప్రభుత్వం కూడా భరిస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. కంపెనీలపై భారం తగ్గించేందుకు, ఉద్యోగాల కల్పన అలాగే పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడంలో భాగంగానే టెలికం రంగానికి కేంద్రం సంస్కరణల ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. మరోవైపు, గత పాలకుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల్లోకి జారిపోయిందని వైష్ణవ్‌ వ్యాఖ్యానించారు.

(చదవండి: పరిశ్రమలు పడక.. ధరలు పైపైకి!)

మరిన్ని వార్తలు