‘క్యాపిటల్‌ గెయిన్స్‌’లో మార్పులు.. అమల్లో సెక్షన్‌ 54, 54ఎఫ్‌లపై ఆంక్షలు

27 Feb, 2023 08:11 IST|Sakshi

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో క్యాపిటల్‌ గెయిన్స్‌కి సంబంధించి మార్పులు వచ్చాయి.  ఇవన్నీ 2023 ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మీకు అవసరం అనిపిస్తే లేదా ఉపయోగం అనిపిస్తే 2023 మార్చి 31లోగా ఏదైనా ప్లానింగ్‌ చేసుకోవచ్చు.  

మిగతా అన్ని పెట్టుబడుల కన్నా ఇంటి మీద పెట్టుబడి సురక్షితమనే భావన ఉంది. భద్రత, లాభం ఎక్కువ. స్టాక్‌ మార్కెట్‌లాగా ఒక రోజులో కుదేలవడం.. ఆవిరి అయిపోవడంలాంటివి వంటి ప్రమాదాలు ఉండవనే ఆలోచనతో ఇంటి మీద ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఇల్లు కొని, కొన్నేళ్ల తర్వాత అమ్మేసి ఆ మొత్తంతో మరొక ఇల్లు కొని మినహాయింపులూ పొందుతుంటారు.  

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట ప్రకారం ఒక ఇల్లు కొని అమ్మితే ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాల్ని మినహాయింపు పొందాలంటే నిర్దేశిత వ్యవధిలో మరో ఇల్లు కొనాలి .. లేదా నిర్దేశిత బాండ్లలో వ్యవధిలోగా ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ మినహాయింపు మన దేశంలో ఆస్తి కొంటేనే వర్తిస్తుంది. ఇలా చేసే వరకు క్యాపిటల్‌ గెయిన్‌ స్కీమ్‌ ద్వారా బ్యాంకుల్లో అకౌంటు తెరవాలి. ఈ అంశాలకు సంబంధించి ఎన్నో ఉదాహరణలు గతంలో మనం ప్రస్తావించాం.

పెద్ద మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ మినహాయింపు మీద ఆంక్షలు వర్తించబోతున్నాయి. సాధారణంగా ఏదో విధి లేక ఇల్లు అమ్మి.. మళ్లీ కొనుక్కునే వారికి మినహాయింపు ఉంటుంది. ఇది సమంజసమే అయినా క్రమేణా ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రజలు వ్యాపార ధోరణిలో పడ్డారు. కొత్త పుంతలు తొక్కుతున్నారు.

విల్లాలు, విలాసవంతమైన భవనాలు, అద్దాల మేడలు, పెద్ద భవంతులవైపు మళ్లుతున్నారు. ఇది ‘‘అవసరం’’ నుండి ‘‘అసమంజసం’’ లేదా ‘‘ఆధునికం’’, ‘‘ఆనందం’’ దాటేసి పరుగెడుతోంది. మినహాయింపు ఉందని విలాసవంతమైన ఇంటి మీద ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే, 2023 ఏప్రిల్‌ 1 నుండి ఈ మినహాయింపు మీద మార్పులు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇక నుంచి ఈ మినహాయింపు రూ.10 కోటి దాటి ఇవ్వరు. మీరు ఇంటి మీద అంతకు మించి ఇన్వెస్ట్‌ చేసినా .. నిర్దేశిత పరిమితి దాటిన మొత్తానికి ఎటువంటి మినహాయింపు ఇవ్వరు. సెక్షన్‌ 54, 54ఎఫ్‌లకు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.  

ఉదాహరణకు మీకు దీర్ఘకాలిక మూలధన లాభం రూ.11 కోట్లు అనుకోండి. మీరు రూ. 11 కోట్లు పెట్టి భవంతి కొన్నా కేవలం రూ. 10 కోట్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి .. అదనపు రూ. 1 కోటిపై పన్ను విధిస్తారు. తస్మాత్‌ జాగ్రత్త!

మరిన్ని వార్తలు