వ్యాపారాలకు చేయూతే ప్రభుత్వ బాధ్యత

25 Feb, 2021 06:00 IST|Sakshi

వ్యాపారం చేయడం కాదు

ప్రైవేటీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) భారీ స్థాయిలో ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా సమర్థించుకున్నారు.  వ్యాపార సంస్థలకు కావాల్సిన తోడ్పాటు అందించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యతని, సొంతంగా వ్యాపారాలు నడపడం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నిధులతో.. నష్టాల్లో ఉన్న సంస్థలను నడిపే బదులు ప్రజోపయోగకరమైన సంక్షేమ పథకాలకు వెచ్చించడం శ్రేయస్కరమని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వమనేది ప్రధానంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ప్రధాని పేర్కొన్నారు. చమురు.. గ్యాస్, విద్యుత్‌ తదితర రంగాల్లో 100 పైగా పీఎస్‌యూలు .. సామర్థ్యానికన్నా తక్కువగా పనిచేయడమో లేక వనరులను సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితుల్లోనో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిల్లో వాటాలు విక్రయించడం తదితర మార్గాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 2021–22 బడ్జెట్‌లో ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై జరిగిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘ఎంటర్‌ప్రైజ్‌లు, వ్యాపారాలకు తోడ్పాటునివ్వడం ప్రభుత్వ బాధ్యత. సొంతంగా వ్యాపార సంస్థలను పెట్టడం, వాటిని నిర్వహించడం వంటివి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు‘ అని ఆయన స్పష్టం చేశారు.  

నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా..
రక్షణ, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, బ్యాంకింగ్‌ తదితర వ్యూహాత్మకమైన నాలుగు రంగాలు మినహా మిగతా అన్ని రంగ్లాలోని పీఎస్‌యూలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ సంస్థలు నామమాత్ర సంఖ్యలో కొనసాగుతాయన్నారు.  పెట్టుబడులు, అంతర్జాతీయంగా పాటించే అత్యుత్తమ విధానాలు, మరింత ప్రతిభావంతులైన మేనేజర్లు, ఆధునికత వంటి సానుకూల పరిణామాలు ప్రైవేట్‌ రంగం రాకతో సాధ్యపడగలవని మోదీ చెప్పారు. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు