ఆయిల్‌ కంపెనీలకు కేంద్రం శుభవార్త, పెట్రోల్‌..డీజిల్‌ రేట్లు తగ్గేనా?

12 Sep, 2022 19:29 IST|Sakshi

నష్టపోతున్న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థకు కేంద్రం పాక్షికంగా సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం ఇంధన రీటైలర్ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌తో పాటు ఇతర కంపెనీలకు రూ.20వేల కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు దేశ వ్యాప్తంగా 90శాతం కంటే ఎక్కుగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆయిల్‌ సంస్థలపై పడింది. దీంతో ఏప్రిల్‌ - జూన్‌ వార్షిక ఫలితాల్లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ప్రతి లీటర్‌ పెట్రోల్‌ పై రూ.10, లీటర్‌ డీజిల్‌పై రూ.14 నష్టంతో మొత్తం రూ.1992.52 కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది.  

ఆ నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇంధనాలపై పన్ను తగ్గింపులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చమురు సబ్సిడీని 58 బిలియన్ రూపాయిలు కేటాయించగా, ఎరువుల సబ్సిడీపై 1.05 ట్రిలియన్ రూపాయలు అందించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది.    

అదే సమయంలో అమెరికాలో ఇంధన తయారీ సామర్ధ్యం తగ్గడం, ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా నుంచి ఎగుమతులు తగ్గాయి. 85శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకున్న చమురు రిఫైనింగ్-కమ్-ఫ్యూయల్ రిటైలింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకే ఉత్పత్తి చేయడంలో బెంచ్‌ మార్క్‌ను క్రాస్‌ చేశాయి. 

ఈ తరుణంలో ఈ ఆగస్ట్‌ నెలలో చమురు కంపెనీలకు ధరల పెంపు లేదా ప్రభుత్వ పరిహారం ద్వారా నిరంతర నష్టాలను పూడ్చేందుకు కొంత జోక్యం అవసరం అని భారత పెట్రోలియం చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా పెట్రోలియం శాఖ ఆర్ధిక సాయం కింద కేంద్రాన్ని 280 బిలియన్‌ డాలర్లు (రూ.28వేల కోట్లు) అడిగినట్లు బ్లూమ్‌ బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది.

పెట్రోలియం శాఖ అభ్యర్ధనపై ఆర్ధిక శాఖ 200బిలియన్ల (రూ.20వేల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇంధన రీటైల్‌ సంస్థలకు ఆర్ధిక సాయం అందనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు