బ్యాంకులకు 15,000 కోట్ల అదనపు మూలధనం

28 Feb, 2022 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బలహీనంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం రూ. 15,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. ఇందులో సింహభాగాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ మొదలైనవి దక్కించుకోనున్నాయి. గత ఏడాది వడ్డీ రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకున్న బ్యాంకులకు ఈ అదనపు మూలధనం లభించనుంది. సదరు బాండ్ల వేల్యుయేషన్‌ను.. ముఖ విలువ కంటే తక్కువగా లెక్క గట్టారంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ అభిప్రాయపడింది. దీనితో, నిధులు సమకూర్చుకున్నప్పటికీ ఆయా బ్యాంకుల టియర్‌ 1 మూలధన నిల్వలు.. నిర్దేశిత స్థాయికన్నా తక్కువగానే ఉన్నాయని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పీఎస్‌బీలకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు