వివాద్‌ సే విశ్వాస్‌తో రూ. 53,684 కోట్లు 

10 Aug, 2021 00:04 IST|Sakshi

పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్‌ సే విశ్వాస్‌ స్కీము ద్వారా ఇప్పటిదాకా రూ. 53,684 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. ఈ పథకం కింద దాదాపు రూ. 99,765 కోట్ల పన్ను వివాదాలకు సంబంధించి 1.32 లక్షల డిక్లరేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. స్కీము కింద డిక్లరేషన్‌ ఇవ్వడానికి 2021 మార్చి 31తో గడువు ముగిసింది. అయితే, చెల్లింపులు జరిపేందుకు ఆఖరు తేదీని ఆగస్టు 31దాకా పొడిగించారు. అదనంగా వడ్డీతో అక్టోబర్‌ 31 దాకా కూడా చెల్లించవచ్చు. 

రూ. 1.67 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు .. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్‌–జూన్‌) మధ్య కాలంలో నికరంగా రూ. 1.67 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్నులు (జీఎస్‌టీ) వసూలైనట్లు లోక్‌సభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ. 6.30 లక్షల కోట్లలో ఇది 26.6 శాతమని ఆయన పేర్కొన్నారు. 2020–21లో రూ. 5.48 లక్షల కోట్లు, 2019–20లో రూ. 5.98 లక్షల కోట్లు జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. 

డీఐసీజీసీ సవరణ బిల్లుకు ఆమోదం 
రూ. 5 లక్షల దాకా డిపాజిట్లకు బీమా భద్రత కల్పిం చేలా డిపాజిట్‌ బీమా, రుణ హామీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో గతవారమే ఇది ఆమోదం పొందింది. బ్యాంకులపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు రూ. 5 లక్షల దాకా డిపాజిట్లను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. 

7 సంస్థలకు ఇంధన రిటైలింగ్‌ లైసెన్సు ..
కొత్త విధానం కింద 7 సంస్థలకు ఆటోమొబైల్‌ ఇంధన రిటైలింగ్‌ లైసెన్సులు జారీ చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ తెలిపారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీతో కలిసి ఆ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్, ఐఎంసీ, ఆన్‌సైట్‌ ఎనర్జీ, అస్సామ్‌ గ్యాస్‌ కంపెనీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్‌ సొల్యూషన్స్‌ ఇండియా, మానస్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈ సంస్థల్లో ఉన్నాయి. ఆర్‌ఐఎల్‌కు గతంలోనే ఇంధన రిటైలింగ్‌ లైసెన్సు ఉండగా దాన్ని అనుబంధ సంస్థ రిలయన్స్‌ బీపీ మొబిలిటీకి బదలాయించి కొత్తగా మరో లైసెన్సు తీసుకుంది. బీపీతో కలిసి ఆర్‌బీఎంఎల్‌ సొల్యూషన్స్‌ పేరిట ఇంకో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసి, దానికి కూడా లైసెన్సు తీసుకుంది.  

13 రాష్ట్రాల్లో విద్యుత్‌ వాహన విధానాలు
విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నిర్దుష్ట విధానాన్ని ఆమోదించిన లేదా నోటిఫై చేసిన 13 రాష్ట్రాల్లో  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణన్‌ పాల్‌ గుర్జర్‌ రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. ఆటోమోటివ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) ప్రకారం విద్యుత్‌ వాహనాల ఖరీదులో బ్యాటరీ ధర వాటా సుమారు 30–40 శాతంగా ఉంటుందని ఆయన వివరించారు.  

మరిన్ని వార్తలు