దేశంలో వంట నూనెల కొరత ఉండదు!

5 Mar, 2022 04:25 IST|Sakshi

దీనిపై ఆందోళన అక్కర్లేదు

ప్రభుత్వానికి పరిశ్రమ భరోసా

పరిశ్రమ, వాణిజ్య ప్రతినిధులతో

వాణిజ్యమంత్రి గోయల్‌ సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల కొరత ఉండబోదని ప్రభుత్వానికి పరిశ్రమ భరోసా ఇస్తోంది. దీనిపై ఆందోళన అక్కర్లేదని సూచిస్తోంది. వంట నూనెల సరఫరాల్లో ఎటువంటి సమస్యలూ లేకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వానికి పరిశ్రమ హామీ ఇచ్చింది. రెండు నెలల్లో ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వంట నూనెల పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు హామీ ఇచ్చినట్లు శుక్రవారం ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. దీనితో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు పువ్వు నూనె భారీగా ఉక్రెయిన్‌ నుంచి దిగుమతులు జరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి గోయల్‌ ఒక కీలక సమావేశం నిర్వహించి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌సహా వంటనూనెల సరఫరాలపై సమీక్ష జరిపారు.  సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) ప్రెసిడెంట్‌ అతుల్‌ చతుర్వేది, ఇండియన్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐవీపీఏ) సెక్రటరీ జనరల్‌ ఎస్‌పీ కమ్రా, అదానీ విల్మర్, రుచీ సొయా, మోడీ న్యాచురల్స్‌సహా ప్రముఖ రిఫైనర్లు, దిగుమతిదారుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సన్‌ఫ్లవర్‌.. తగినంత లభ్యత!
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కొరత లేదని సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు  మంత్రికి  తెలియజేశారు. మార్చిలో డెలివరీ కోసం మొదటి షిప్‌మెంట్‌ 1.5 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ యుద్ధానికి ముందే ఉక్రెయిన్‌ నుండి బయలుదేరింది. త్వరలో ఈ షిప్‌మెంట్‌ (దిగుమతుల) భారత్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో ఒక నెలలో 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరగుతుంది. 

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాటా దాదాపు 1.5–2 లక్షల టన్నులు. హార్డ్‌కోర్‌ వినియోగదారుల (కేవలం సన్‌ఫ్లవర్‌ వంట నూనె వినియోగించే వారు) డిమాండ్‌ను తీర్చడానికి లక్ష టన్నుల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ మాత్రమే అవసరం. దేశంలో పొద్దుతిరుగుడు నూనెకు ఆవాలు, సోయాబీన్‌ నూనెల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖకు పరిశ్రమ  తెలిపిందని ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 11 లక్షల టన్నుల కొత్త ఆవాల పంట రావడంతో వచ్చే 2–3 నెలల్లో దేశంలో సరఫరాలు తగిన స్థాయిలోనే ఉంటాయని భరోసాను ఇచ్చింది. భారతదేశం తన వంట నూనెల డిమాండ్‌లో 60 కంటే ఎక్కువ వాటా దిగుమతులదే కావడం గమనార్హం.  

తయారీని పెంచే మార్గాలు అన్వేషించండి: గోయల్‌
కాగా, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచే దిశగా తగిన మార్గాలు అన్వేషించాలని పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. అలాగే, టెక్నాలజీలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దే క్రమంలో 10 పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌లను లేదా నవకల్పనల కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా 15 శాతం స్థాయిలో ఉంది. డీపీఐఐటీ వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

జీడీపీలో ఎగుమతుల వాటాను 25 శాతానికి పెంచడంపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. సర్వీసుల ఎగుమతుల్లో టాప్‌ మూడు దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదగడం, విదేశీ వాణిజ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు తోడ్పాటు అందించడం వంటి అంశాలపై కసరత్తు జరగాలని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశీ కంపెనీలు మద్దతునివ్వాలని గోయల్‌ చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంపై పలు దేశాల్లో ఆసక్తి నెలకొందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు