ఎల్‌ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..

16 Apr, 2022 00:41 IST|Sakshi

యాంకర్‌ ఇన్వెస్టర్ల ఎంపికలో కేంద్రం

సుమారు 60 సంస్థల షార్ట్‌లిస్ట్‌

జాబితాలో బ్లాక్‌రాక్, ఫిడెలిటీ,

జేపీ మోర్గాన్‌ తదితర సంస్థలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మెగా పబ్లిక్‌ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్‌రాక్, శాండ్స్‌ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాండర్డ్‌ లైఫ్, జేపీ మోర్గాన్‌ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్‌ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్‌ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్‌ఐసీ వేల్యుయేషన్‌ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్‌పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.  

25 శాతం డ్రాపవుట్‌..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్‌లిస్ట్‌ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్‌) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు.

సుమారు 12 యాంకర్‌ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్‌ ఇష్యూను ఏప్రిల్‌లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు