టెక్‌ కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించవద్దు

15 Jul, 2022 06:29 IST|Sakshi

అలా చేస్తే 5జీ సేవలకు దొడ్డిదారిన ప్రవేశం కల్పించినట్లవుతుంది

కేంద్రానికి సీవోఏఐ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: బడా టెక్‌ కంపెనీలు ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రంను కేటాయించవద్దని కేంద్రానికి టెల్కోల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే అవి దొడ్డిదారిన టెలికం రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టెల్కోలకు వర్తించే నిబంధనలు, పెనాల్టీలు వంటి బాదరబందీలేవీ బడా టెక్‌ కంపెనీలకు ఉండవు.

క్యాప్టివ్‌ (సొంత అవసరాలకు) 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయిస్తే.. భారత్‌లోని కంపెనీలకు 5జీ సర్వీసులు, సొల్యూషన్స్‌ అందించడానికి బడా టెక్నాలజీ సంస్థలకు దొడ్డిదారిన ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుంది. వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా స్పెక్ట్రం కేటాయిస్తే, అన్ని సంస్థలకూ సమానంగా అవకాశాలు కల్పించాలన్న సూత్రానికి విఘాతం కలుగుతుంది‘ అని సీవోఏఐ వివరించింది.  

ఆదాయాలకు దెబ్బ..
ఇతరత్రా కంపెనీలు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేస్తే టెల్కోల ఆదాయం గణనీయంగా పడిపోతుందని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచర్‌ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక తాము ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం అర్ధరహితంగా మారుతుందని తెలిపారు.

టెక్‌ కంపెనీలు తమ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ కోసం టెల్కోల నుంచి స్పెక్ట్రంను లీజుకు తీసుకోవచ్చని, డిమాండ్‌ను బట్టి వాటికి నేరుగా కూడా కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీవోఏఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

5జీ స్పెక్ట్రం కావాలనుకుంటున్న కంపెనీలు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం సంతోషించతగ్గ విషయమని సీవోఏఐ పేర్కొంది.   జులై నెలాఖరులో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్‌ కూడా పాల్గొంటోంది. ఈ వేలంలో రూ. 4.3 లక్షల కోట్లు విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను విక్రయించనున్నారు. టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా కూడా దరఖాస్తు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు