పలు మెడికల్‌ పరికరాలపై భారీ తగ్గింపు..!

24 Jul, 2021 18:48 IST|Sakshi

న్యూ ఢిల్లీ:  కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మెడికల్‌ పరికరాల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్‌ ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్‌ మెషిన్‌, నెబ్యూలైజర్‌, డిజిటల్‌ థర్మో మీటర్‌,గ్లూకో మీటర్‌ వంటి మెడికల్‌ పరికరాలకు  కరోనా నేపథ్యంలో గణనీయంగా డిమాండ్‌ పెరిగింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఐదు మెడికల్‌ పరికరాలపై  ట్రేడ్‌ మార్జిన్‌ను ప్రభుత్వం పరిమితం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. దీంతో పలు మెడికల్‌ పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలిపారు. ఈ ధరలు జూలై 20 నుంచి అమలులోకి వస్తుందన్నారు. 2022 జనవరి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ధరలు అమలులో ఉండనున్నాయి. 

ఫార్మాస్యూటికల్ డ్రగ్స్,  సంబంధిత పరికరాల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), ప్రైజ్‌ టూ డిస్ట్రిబ్యూటర్‌ (పిటిడి) స్థాయిలో 70 శాతం ధరలను పరిమితం చేసింది. పరిశ్రమల సంఘాలైన ఫిక్కీ, అద్వామెడ్, అమ్చామ్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  ఈ ఐదు మెడికల్‌ పరికరాలకు చెందిన 684 ఉత్పత్తులు, 620 ఇతర ఉత్పత్తులు ఎమ్‌ఆర్‌పీ ధరల్లో సుమారు 88 శాతం తగ్గనున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కోవిడ్‌-19  సంబంధిత మెడికల్‌ ఉత్పత్తులను తగ్గించిన విషయం తెలిసిందే.  పీపీఈ కిట్, మాస్క్‌లు, పల్స్ ఆక్సిమీటర్లు, బీపాప్ యంత్రాలు, శానిటైజర్లు,  ఇతర పరికరాలతో సహా కోవిడ్‌-19 ముఖ్యమైన వస్తువులపై ఆదాయపు మంత్రిత్వ శాఖ పన్ను మాఫీ చేసింది. అంతేకాకుండా రెమ్‌డెసివిర్,  హెపారిన్ సహా అన్ని కరోనావైరస్ మెడిసిన్లపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

మరిన్ని వార్తలు