సంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి

29 Apr, 2022 06:26 IST|Sakshi
కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌

కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌

2021 డిసెంబర్‌ త్రైమాసిక గణాంకాల విడుదల

న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలో బలపడుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో తొమ్మిది పరిశ్రమలలో దాదాపు 3.14 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందారని,  ఇది సంఘటిత రంగంలో ఉపాధిలో పెరుగుతున్న ధోరణిని సూచిస్తోందని ఆయన ఒక ట్వీట్‌ చేశారు. 2021 సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ సంఖ్య 3.10 కోట్లని తెలిపారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ త్రైమాసిక  (అక్టోబర్‌–డిసెంబర్‌) సర్వే నివేదికలోని గణాంకాలను ఆయన ఉటంకించారు. గురువారం విడుదలైన నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► తొమ్మిది రంగాలు– తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, వసతి/రెస్టారెంట్లు, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవల విభాగాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించి ఉపాధి డేటా ప్రాతిపదికన ఈ గణాంకాలు వెలువడ్డాయి. మొత్తం ఉపాధి రంగంలో ఈ తొమ్మిది రంగాల వాటా దాదాపు 85 శాతం.  
► నివేదిక ప్రకారం అంచనా వేసిన మొత్తం కార్మికుల సంఖ్యలో దాదాపు 39 శాతం వాటాతో తయారీ రంగం మొదటి స్థానంలో నిలిచింది. తరువాత విద్యా రంగం 22 శాతంతో ఉంది. సమీక్షా కాలంలో తయారీ రంగంలో అత్యధికంగా 124 లక్షల మంది కార్మికులు ఉన్నారు.  విద్యా రంగం 69.26 లక్షల మందిని కలిగిఉంది.  
► వాటి తర్వాత ఐటీ/బీపీఓలు (34.57 లక్షలు), ఆరోగ్యం (32.86 లక్షలు), వాణిజ్యం (16.81 లక్షలు), రవాణా (13.20 లక్షలు), ఆర్థిక సేవలు (8.85 లక్షలు), వసతి/రెస్టారెంట్లు (8.11 లక్షలు), నిర్మాణ (6.19 లక్షలు) రంగాలు ఉన్నాయి.  
► దాదాపు అన్ని (99.4 శాతం) విభాగాలు వేర్వేరు చట్టాల క్రింద నమోదయ్యాయి.  
► మొత్తంమీద, దాదాపు 23.55 శాతం యూనిట్లు తమ కార్మికులకు ఉద్యోగ శిక్షణను అందించాయి. తొమ్మిది రంగాల్లో ఆరోగ్య విభాగంలోని 34.87 శాతం యూనిట్లు ఉద్యోగ శిక్షణను అందించగా, ఐటీ/బీపీఓల వాటా ఈ విషయంలో 31.1 శాతంగా ఉంది.  
► కార్మిక మంత్రిత్వశాఖ నియంత్రణలో లేబర్‌ బ్యూరోతో ఈ సర్వే జరిగింది. వ్యవసాయేతర సంస్థల్లోని మొత్తం ఉపాధిలో ఎక్కువ భాగం ఈ తొమ్మిది ఎంపిక చేసిన రంగాలదే కావడం గమనార్హం.  వ్యవస్థీకృత, అసంఘటిత విభాగాలలో ఉద్యోగాలు, నియామకాలకు  సంబంధించి ఈ సర్వే నిర్వహణ జరుగుతుంది.  

>
మరిన్ని వార్తలు