లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం

30 Nov, 2021 06:37 IST|Sakshi

టాప్‌ 2 డిజిటల్‌ దేశాల్లో ఒకటిగా భారత్‌ను తీర్చిదిద్దడంపై దృష్టి

కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ. 75 లక్షల కోట్లు) ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రపంచంలోనే టాప్‌ 2 డిజిటల్‌ దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా డిజిటల్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వచ్చే 25 ఏళ్ల ప్రణాళికలను మంత్రి వివరించారు. ప్రభుత్వ సర్వీసులను మరింతగా డిజిటలీకరించడం, సమ్మిళిత వృద్ధికి తోడ్పడేలా అస్పష్టతకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం వంటి అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, టెక్నాలజీలు సురక్షితంగా, విశ్వసనీయంగా. అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

‘‘కొంగొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్, సైబర్‌ సైక్యూరిటీ లాంటి అనేక విభాగాల్లో మనం లీడర్లుగా ఎదగాలి’’ అని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.  మరోవైపు, ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అంశంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాష్‌ సాహ్ని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఏ సర్వీస్‌ అయినా, ఏ మాధ్యమంలోనైనా లభించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు. అటు సైబర్‌ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్‌.. ప్రపంచంలోనే 10వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లుగా సైబర్‌ సెక్యూరిటీ అంశంలో భారత్‌ గణనీయంగా పురోగతి సాధించిందని వివరించారు.

మరిన్ని వార్తలు