క్యాబ్‌ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్‌

11 May, 2022 08:26 IST|Sakshi

ఓలా, ఉబెర్‌ తదితర సంస్థల ప్రతినిధులతో భేటీ 

పద్ధతులు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

న్యూఢిల్లీ: ఓలా, ఉబెర్‌ తదితర ట్యాక్సీ సర్వీసుల సంస్థలపై (క్యాబ్‌ అగ్రిగేటర్స్‌) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఆయా సంస్థల ప్రతినిధులతో మంగళవారం సమావేశమైంది. సిస్టమ్‌లను సత్వరం మెరుగుపర్చుకోవాలని, వినియోగదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించింది. తమ విధానాలు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘వారి ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్న సంగతి వారికి చెప్పాం. గణాంకాలు కూడా చూపించాము. సిస్టమ్‌లను సరిచేసుకోవాలని, ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించాము. లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాము‘ అని సమావేశం అనంతరం వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

క్యాబ్‌ అగ్రిగేటర్స్‌పై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన చెప్పారు. ట్యాక్సీ సేవల సంస్థలు సత్వరం పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగేలా క్యాబ్‌ అగ్రిగేటర్లు అనుచిత వ్యాపార విధానాలు పాటించకుండా త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తప్పుడు విధానాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే వారికి స్పష్టం చేసినట్లు ఖరే పేర్కొన్నారు. మరోవైపు, సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటామని క్యాబ్‌ అగ్రిగేటర్లు పేర్కొన్నారు. క్యాన్సిలేషన్‌ చార్జీల విషయానికొస్తే, ఆర్డరు రద్దవడం వల్ల డ్రైవరు నష్టపోకుండా పరిహారం చెల్లించేందుకే సదరు చార్జీలు విధిస్తున్నట్లు తెలిపారు.

ఓలా, ఉబెర్, మేరు, రాపిడో, జుగ్ను ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. వివాదాస్పద అంశాల పరిష్కారంపై వినియోగదారుల వ్యవహారాల విభాగంతో కలిసి పని చేస్తున్నామని ఉబెర్‌ ఇండియా సెంట్రల్‌ ఆపరేషన్స్‌ విభాగం హెడ్‌ నితీష్‌ భూషణ్‌ తెలిపారు.  

ఫిర్యాదులు ఇలా..: చార్జీలు, ట్రిప్‌ల రద్దు విషయాల్లో క్యాబ్‌ అగ్రిగేటర్లపై భారీగా ఫిర్యాదులు ఉంటున్నాయి. వివిధ కారణాల వల్ల ట్రిప్‌లను అంగీకరించడానికి ఇష్టపడని డ్రైవర్లు వాటిని రద్దు చేసుకోవాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రిప్‌ క్యాన్సిల్‌ చేస్తే అగ్రిగేటర్‌ సంస్థ పెనాల్టీలు విధిస్తోంది. అలాగే, అసలు ఏ ప్రాతిపదికన ప్రయాణ చార్జీలను నిర్ణయిస్తున్నారన్న అంశంపై పారదర్శకత లోపించింది. ఈ నేపథ్యంలో క్యాబ్‌ అగ్రిగేటర్లు అనుసరిస్తున్న అల్గోరిథమ్‌లు, ఇతరత్రా విధానాలను కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ఖరే పేర్కొన్నారు.

ట్రావెల్, ఫుడ్‌ అగ్రిగేటర్లపై ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ ఫిర్యాదు..
ఆన్‌లైన్‌ ట్రావెల్‌ (ఓటీఏ), ఫుడ్‌ అగ్రిగేటర్‌లు (ఎఫ్‌ఎస్‌ఏ) పోటీని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తున్నాయంటూ ఆతిథ్య రంగ సంస్థల సమాఖ్య ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ తాజాగా ఆర్థిక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కమిటీ చైర్మన్‌ జయంత్‌ సిన్హాకు లేఖ రాసింది. కొన్ని ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా సంస్థల్లో ఎలాంటి వ్యవస్థా లేకపోవడంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ గుర్‌బక్షీష్‌ సింగ్‌ కోహ్లి పేర్కొన్నారు.

ఓటీఏలు, ఎఫ్‌ఎస్‌ఏలు.. కస్టమర్లకు సర్వీసులు అందించడంలో విఫలమవుతుండటం వల్ల ఇటు కస్టమర్లు అటు సర్వీస్‌ ప్రొవైడర్లు సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని వివరించారు. పైగా తమకు సంబంధం లేని చార్జీలను వివిధ పేర్లు, సాకులతో రెట్టింపు స్థాయిలో విధిస్తున్నాయన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లే వీటిని విధిస్తున్నాయనే భావనలో కస్టమర్లు ఉంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.  

మరిన్ని వార్తలు