‘ఫ్లెక్స్‌ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు

25 Sep, 2021 03:40 IST|Sakshi

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

పుణె: కార్ల తయారీ కంపెనీలు.. ఫ్లెక్స్‌–ఫ్యుయల్‌ ఇంజిన్లను ప్రవేశపెట్టడం తప్పనిసరి చేస్తూ త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ మొదలుకుని టాటా, మహీంద్రా వంటి సంస్థలు దీన్ని పాటించేలా 3–4 నెలల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తన జీవితకాలంలో పెట్రోల్, డీజిల్‌ వినియోగం పూర్తిగా నిలిచిపోవాలని, దేశీయంగా ఉత్పత్తయ్యే ఇథనాల్‌ ఇంధన వినియోగం పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఫ్లెక్స్‌ ఇంజిన్లు తయారు చేసే దాకా తన వద్దకు రావద్దంటూ ద్విచక్ర వాహన సంస్థలకు కూడా సూచించానని, ఆ తర్వాత అవి ఇథనాల్‌–ఫ్లెక్స్‌ ఇంజిన్లను రూపొందించాయని గడ్కరీ తెలిపారు. ఇంధనంలో 51–83% దాకా ఇథనాల్‌ లేదా మిథనాల్‌ను కలిపినా పనిచేయగలిగే ఇంజిన్లను ఫ్లెక్స్‌ ఇంజిన్లుగా వ్యవహరిస్తారు. మరోవైపు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు హారన్‌లను కూడా సంగీత ధ్వనులతో రూపొందించాలని కార్ల తయారీ సంస్థలకు సూచించినట్లు గడ్కరీ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు