క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..! వాటి పరిధిలోకి

20 Mar, 2022 17:15 IST|Sakshi

క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనుంది. క్రిప్టోకరెన్సీలను జీఎస్టీ చట్టం కిందకు తీసుకొచ్చేందుకు కేంద్రం పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు అందించే సర్వీసులపై మాత్రమే కేంద్రం 18 శాతం జీఎస్టీను విధిస్తోంది. వీటిని ఆర్థిక సేవల కేటగిరీగా పన్నులను వేస్తోంది. 

జీఎస్టీ కిందకు వస్తే..!
క్రిప్టోకరెన్సీలను జీఎస్టీ చట్టం కిందకు తీసుకొస్తే..క్రిప్టో లావాదేవీ మొత్తం విలువపై పన్ను విధించే అవకాశం ఉంటుంది. ఇక కొందరు జీఎస్టీ అధికారులు క్రిప్టోలను  లాటరీలు, క్యాసినోలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, హార్స్ రేసింగ్ కిందకు వస్తాయని అభిప్రాయ పడుతున్నారు. వీటిపై 28 శాతంగా జీఎస్టీ రేటు ఉంది. మరికొందరు క్రిప్టోకరెన్సీలను గోల్డ్ లాగా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.కాగా ప్రస్తుతం గోల్డ్‌తో జరిపే లావాదేవీ మొత్తంపై 3 శాతం జీఎస్టీను వసూలు చేస్తున్నారు.

స్పష్టత అవసరం..!
క్రిప్టో కరెన్సీలపై విధించే జీఎస్టీపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం వాల్యుపై పన్ను విధించాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సి ఉంది. ఒకవేళ క్రిప్టో కరెన్సీలను గూడ్స్‌గా లేదా సర్వీసెస్‌గా వర్గీకరిస్తే.. వాటిపై తప్పనిసరిగా పన్ను విధింపు ఉండే అవకాశం ఉండనుందని సదరు జీఎస్టీ అధికారులు అభిప్రాయపడ్డారు.  ఇక క్రిప్టో కరెన్సీల మొత్తం లావాదేవీపై జీఎస్టీ విధిస్తే ఈ రేటు 0.1 శాతం నుంచి 1 శాతంగా ఉండనుంది. కాగా ప్రస్తుతం  ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రేటు 0.1శాతామా లేదా 1 శాతామా అని నిర్ణయించడానికి ముందు.. వీటి వర్గీకరణను ఖరారు చేయాల్సి ఉంది.

క్రిప్టో కరెన్సీల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల బడ్జెట్‌లోనే క్రిప్టో అసెట్స్‌ను ఆదాయపు పన్ను కిందకు తీసుకొస్తూ.. ప్రభుత్వం 30 శాతం పన్నును ప్రతిపాదించింది. అంతేకాక క్రిప్టో ఆస్తుల బదిలీపై రూ.10 వేలు మించితే 1 శాతం లెక్కన టీడీఎస్ ఉంటుంది. 1 శాతం టీడీఎస్ జూలై 1, 2022 నుంచి అమల్లోకి వస్తుండగా.. క్రిప్టోలపై పన్ను మాత్రం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అంతేకాక ఈ కరెన్సీలను రెగ్యులేట్ చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది.

చదవండి: మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!

మరిన్ని వార్తలు