గుడ్‌ న్యూస్‌.. అదే జరిగితే ఫోన్‌తో పాటు టీవీ, పీసీల రేట్లూ తగ్గడం ఖాయం

14 Jan, 2022 20:58 IST|Sakshi

సాధారణంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీలో డిస్‌ప్లే, కొన్ని ప్యానెల్స్‌ క్వాలిటీ విషయంలో ఫోన్‌ మేకర్లు కాంప్రమైజ్‌ అవ్వరు. ఇండియమ్‌ అనే అరుదైన ఎలిమెంట్‌ను ఇందుకోసం ఉపయోగిస్తుంటారు. ఇది చాలా కాస్ట్‌లీ వ్యవహారం. అయితే ఇండియమ్‌ ప్లేస్‌లో మరో మెటీరియల్‌ను తీసుకొస్తే.. తమ భారం తగ్గుతుందని, తద్వారా ఫోన్‌ల రేట్లు తగ్గించి మార్కెట్‌ పెంచుకోవాలని దశాబ్ధం పైగా కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో గుడ్‌ న్యూస్‌ చెప్పారు యూకే రీసెర్చర్లు. 


భూమ్మీద దొరికే తొమ్మిది  అరుదైన మూలకాల్లో Indium మూలకం ఒకటి.  ఇండియంతో(Indium Tin Oxide రూపంలో) ఓఎల్‌ఈడీ(organic light-emitting diode) టచ్‌  స్క్రీన్‌లను, ఇతర ప్యానెల్స్‌ను తయారు చేస్తుంటారు. మొబైల్స్‌తో పాటు కంప్యూటర్‌, పీసీలు, టీవీలు, సోలార్‌ ప్యానెల్స్‌, ఎల్‌ఈడీ లైట్స్‌ తయారీలో సైతం ఈ మూలకాన్ని ఉపయోగిస్తుంటారు.  ఇది చాలా చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఫోన్‌ ధరల విషయంలో కొన్ని కంపెనీలు అస్సలు కాంప్రమైజ్‌ అవ్వవు. అయితే ఈ మెటీరియల్‌ ప్లేస్‌లోకి గ్రాఫిన్‌ను గనుక తీసుకొస్తే.. ఫోన్‌ మేకర్స్‌కి భారీ ఉపశమనం దొరుకుతుందనే ప్రయోగాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో..

 

యూకేకి చెందిన పేరాగ్రాఫ్‌ కంపెనీ, లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ప్రత్యామ్నాయ మెటీరియల్‌ విషయంలో స్పష్టత వచ్చింది. గ్రాఫిన్‌తో తయారు చేసిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ప్యానెల్స్‌ను.. డెమోను విజయవంతంగా చూపించారు పరిశోధకులు. తద్వారా ఇండియమ్‌కు గ్రాఫిన్‌ సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ఇన్నాళ్లకు ప్రపంచానికి చాటి చెప్పారు. 


ఇండియమ్‌ ప్యానెల్‌

వాస్తవానికి ఇండియమ్‌కు ఆల్టర్‌నేట్‌ కోసం చాలా కాలంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏదీ ఇండియమ్‌ ఇచ్చినంత అవుట్‌పుట్‌ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలో గ్రాఫిన్‌ రీప్లేస్‌ చేస్తుందన్న వార్త ఫోన్‌ మేకర్స్‌కు శుభవార్తే అని చెప్పొచ్చు.  

ఇక Grapheneను వండర్‌ మెటీరియల్‌ అని అభివర్ణిస్తుంటారు. ఇండియమ్‌తో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. సింగిల్‌ లేయర్‌ కార్బన్‌ అణువులు, తేనెపట్టులాంటి నిర్మాణంను పోలి ఉండే గ్రాఫిన్‌ను.. భూమ్మీద దొరికే బలమైన మెటీరియల్స్‌లో ఒకటిగా చెప్తుంటారు. కానీ, అవసరానికి అనుగుణంగా ఆకారాన్ని మార్చుకోవచ్చు.. పైగా కాపర్‌ కంటే మంచి విద్యుత్‌ వాహకంగా  పని చేస్తుంది కూడా.  మెయిన్ స్ట్రీమ్‌ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇప్పటిదాకా గ్రాఫిన్‌ను వాడింది లేదు. కాబట్టి.. తొలి అడుగు పడడానికి కొంచెం టైం పట్టొచ్చు(అన్నీ కుదిరితే 2023 తొలి భాగం అనేది ఒక అంచనా). అదే జరిగితే స్మార్ట్‌ ఫోన్లు మాత్రమే కాదు.. కంప్యూటర్‌లు, టీవీల తయారీ ఖర్చు..మార్కెట్‌లో కొన్ని బ్రాండెడ్‌ ఫోన్‌ ధరలు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు.

చదవండి: జీమెయిల్‌ మెమెరీ ఫుల్‌ కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి

మరిన్ని వార్తలు