బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్‌  

23 Sep, 2022 15:29 IST|Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు/వసూలు కానీ మొండి బాకీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం మేర తగ్గి 5 శాతానికి పరిమితమవుతాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అంతేకాదు 2024 మార్చి నాటికి 4 శాతానికి క్షీణిస్తాయని పేర్కొంది. అయినా కానీ, బ్యాంకింగ్‌ రంగం ముందు ఇతర విభాగాల నుంచి సవాళ్లు ఉన్నట్టు ప్రస్తావించింది. 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)ల రుణ విభాగంపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో బ్యాంకులు ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎక్కువగా రుణ వితరణ చేయడంతో, ఈ విభాగంలో స్థూల ఎన్‌పీఏలు 2024 మార్చి నాటికి 10-11 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. ఈ విభాగంలో స్థూల ఎన్‌పీఏలు 2022 మార్చి నాటికి 9.3 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో రుణాల పునరుద్ధరణ 6 శాతంగా ఉంటే, మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాల పునరుద్ధరణ 2 శాతమే ఉన్నట్టు గుర్తు చేసింది. 6 శాతం పునరుద్ధరణ రుణాల్లో పావు వంతు ఎన్‌పీఏలుగా మారొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. రుణ విభాగాల పరంగా ఎంఎస్‌ఎంఈల కంటే పెద్ద కంపెనీల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది.  (ఓలా ఎలక్ట్రిక్‌  స్కూటర్లు..ఇక  విదేశాల్లో రయ్‌..రయ్‌!)

కార్పొరేట్‌ విభాగం మెరుగు 
పెద్ద కార్పొరేట్‌ విభాగంలో రుణాల పరంగా స్థూల ఎన్‌పీఏలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి 2 శాతానికి తగ్గుతాయని క్రిసిల్‌ పేర్కొంది. 2018 నాటికి ఈ విభాగంలో స్థూల ఎన్‌పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాల్లో కార్పొరేట్‌ రుణాలకు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టడమే మెరుగుదలకు కారణంగా పేర్కొంది.  

మరిన్ని వార్తలు