ఆఫీసు స్పేస్‌ అధరహో.. తాజా నివేదిక

2 Sep, 2023 10:02 IST|Sakshi

ఈ ఏడాది 4 నుంచి  4.5 కోట్ల చ.అ. లావాదేవీలు 

స్థిరమైన ఆర్థిక వృద్ధే ఇందుకు కారణం 

హైదరాబాద్‌లో 40–60 లక్షల చ.అ. లీజులు 

కొలియర్స్‌ తాజా నివేదిక అంచనా  

సాక్షి,హైదరాబాద్‌:   ఈ ఏడాది దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో 4-4.5 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరుగుతాయని కొలియర్స్‌ నివేదిక అంచనా వేసింది. స్థిరమైన ఆర్థికక దృక్పథంతో పాటు అమెరికా, యూకే, యూరప్‌ దేశాలకు ప్రధాన వ్యాపార వనరు ఇండియా కావటంతో ఇక్కడి ఆఫీసు స్పేస్‌పై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు రెపో రేట్లు స్థిరమైన దశలోకి చేరుకున్నప్పటికీ జీఎస్‌టీ వసూళ్లు, తయారీ, సేవా రంగాలు, ఈక్విటీ మార్కెట్ల వేగంతో ఈ వృద్ధి అవకాశాలున్నాయని కొలియర్స్‌ ఆఫీసు సర్వీసెస్‌ ఎండీ పీష్‌ జైన్‌ అన్నారు. 

ఆరు నగరాలలో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 1.01 కోట్ల చ.అ. స్థూల ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. రెండో త్రైమాసికం  (క్యూ2) నాటికి 46 శాతం వృద్ధి రేటుతో 1.46 కోట్ల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ1లోని ఆఫీసు స్పేస్‌ లావాదేవీలలో టెక్నాలజీ రంగం వాటా 24 శాతంగా ఉండగా.. 18 శాతం ఫ్లెక్సిబుల్‌ స్పేస్, 17 శాతం ఇంజనీరింగ్‌ మరియు తయారీ రంగం వాటాలున్నాయి. క్యూ2 నాటికి టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలు 5శాతం వృద్ధిని సాధించాయి. ఇంజనీరింగ్, తయారీ రంగాలు క్యూ1తో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. కీలక రంగాలలో ఆరోగ్యకరమైన వృద్ధి, లీజుదారులకు విశ్వాసం పెరగడం వంటి కారణంగా ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉంది.  (వర్క్‌ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్‌ అంటున్న ఐటీ దిగ్గజం)

నగరంలో 40-60 లక్షల చ.అడుగులు 
హైదరాబాద్‌లో క్యూ1లో13 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 19 శాతం వృద్ధి రేటుతో 15 లక్షల చ.అ.లకు పెరిగింది. ఈ ఏడాది ముగింపు నాటికి సుమారు 40–60 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరుగుతాయని కొలియర్స్‌ అంచనా వేసింది. వివిధ విభాగాలలో డిమాండ్, వ్యాపార సెంటిమెంటే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది.  

మరిన్ని వార్తలు