అప్పడు వర్క్‌ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా...

10 May, 2022 11:00 IST|Sakshi

కరోనా కష్ట కాలం వచ్చిన తర్వాత వర్క్‌ ఫ్రం హోం అనేది కామన్‌ అయిపోయింది. కానీ అంతకు ముందు అత్యవసర పని ఉన్నా, ఆపత్కాలం వచ్చినా ఇంటి నుంచి పని అంటే యాజమన్యాలు ఒప్పుకునేవి కావు. పని జరగడం కంటే పాలసీలే ముఖ్యం అన్నట్టుగా కర్ర పెత్తనం చలాయించేవి. ఇలాంటి ఓ సంఘటనకు  సంబంధించిన విషయాలను ఓ ఉద్యోగి @బౌసర్‌డేంజర్‌ యూజర్‌ నేమ్‌తో రెడ్డిట్‌లో షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. 

బౌసర్‌డేంజర్‌ అనే రెడ్డిట్‌ యూజర్‌ నేమ్‌ కలిగిన వ్యక్తి అమెరికాలోని ఓ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లో పని చేసేవాడు. అతడు నివసిస్తున్న ఇంటి నుంచి న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌కి కనీసం గంట ప్రయాణం. ఎప్పటిలాగే ఒక రోజు ప్లాంటుకు వెళ్లేందుకు రెడీ అవగా.. బయట దట్టమైన మంచు కురుస్తోంది. కారుతో సహా రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి.

వర్క్‌ ఫ్రం హోం చేస్తాను
మంచు వల్ల ఆఫీసుకు రాలేకపోతున్న విషయాన్ని వెంటనే ప్లాంటులో తన సూపర్‌ వైజర్‌కి ఈమెయిల్‌ ద్వారా తెలిపాడా ఉద్యోగి.. ఆ మెయిల్‌లో బయట మంచు తీవ్రంగా కురుస్తోందని, ప్రయాణం చేసేందుకు వీలుగా బయట పరిస్థితులు లేవని, కాబట్టి ఈ రోజు నేను ప్లాంటుకు వచ్చి స్వయంగా చేయదగ్గ పనులు కూడా లేనందున వర్క్‌ ఫ్రం హోంకి అనుమతి ఇవ్వాలని కోరాడు. తనకు అప్పగించిన పేపర్‌ వర్క్‌ని ఇంటి దగ్గరే ఉంటూ ల్యాప్‌ట్యాప్‌లో పూర్తి చేసి పంపిస్తానంటూ వివరించాడు.

మన పాలసీ అది కాదు
ఉద్యోగి నుంచి వచ్చిన ఈమెయిల్‌కి సూపర్‌వైజర్‌ స్పందిస్తూ.. ఒక ఉద్యోగిగా ఆఫీస్‌కు రావడం నీ బాధ్యత, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పని చేస్తామంటూ కుదరదు. ఆఫీసుకు వస్తున్నందుకే నీకు జీతం చెల్లిస్తోంది. కంపెనీ పాలసీ ఇదే విషయం చెబుతుంది. ఏదో కారణం చెప్పి ఆఫీసుకు రానంటే ఎలా.. అయినా నీవు చెప్పినంత దారుణంగా బయట పరిస్థితులు లేవు. నేను ఆఫీసులోనే ఉన్నారు. నువ్వు రావడమే మంచిది. నీకు రావడం వీలు కాని పక్షంలో నిరంభ్యతరంగా సెలవు తీసుకోవచ్చు. కానీ వర్క్‌ ఫ్రం హోం చేస్తానంటూ కోరడం సంస్థ పాలసీలకు విరుద్ధం. కాబట్టి నీ రిక్వెస్ట్‌ను ఆమోదించడం లేదంటూ బదులిచ్చాడు.

చేయగలిగిందేం లేదు
సూపర్‌వైజర్‌ వర్క్‌ ఫ్రం హోంకి అంగీకరించకపోవడంతో... వెంటనే బటయకు వచ్చి చూస్తే ఊహించనదాని కంటే మంచు ఎక్కువగా ఉంది. అతి కష్టం మీద సమీపంలో ఉన్న స్టోరుకి వెళ్లి మంచును తొలగించే వస్తువులను తీసుకుని వచ్చి ఇంటి ప్రాంగణం శుభ్రం చేసుకునే పనిలో మునిగిపోయాడు. ఆ తర్వాత మంచు కురిసే సమయంలో వేడివేడి స్నాక్స్‌ తింటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు.

ఇంటి దగ్గరయినా పని చేయ్‌ ప్లీజ్‌
ఇంతలో సూపర్‌ వైజర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నువ్వు ఆఫీసకు వస్తున్నావా ? లేదా అంటూ ప్రశ్నించాడు. దానికి బదులుగా ‘ బయట మంచు ఎక్కువగా ఉంది. నేను సంస్థ పాలసీ రూల్స్‌ను పాటిస్తూ ఈ రోజు సెలవు తీసుకున్నాను. కాబట్టి ఆఫీసుకు రావరడం లేదంటూ బదులిచ్చాడు. వెంటనే ఆఫీసుకు రానక్కర్లేదు అర్జంటుగా చేయాల్సిన పేపర్‌ వర్క్‌ ఉంది. నువ్వు ఇంటి దగ్గరి నుంచైనా ఆ పని చేసి త్వరగా పంపించు అంటూ రిక్వెస్ట్‌ చేశాడా సూపర్‌వైజర్‌.

ఇప్పుడు పాలసీలో భాగం
పై అధికారి కోరినట్టు సంస్థ అవసరాలకు తగ్గట్టుగా సెలవు రోజున కూడా ఇంటి దగ్గర పని చేసినట్టు ఆ ఉద్యోగి తెలిపాడు. ఈ ఘటన 2018లో జరిగింది. కరోనాకి ముందు వర్క్‌ ఫ్రం హోం అంటే యజమాన్యాలు సహించేవి కావు. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటారనే అపోహా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వర్క్‌ ఫ్రం హోం అనేది కామన్‌గా మారింది. చాలా సంస్థలు ఇప్పడు వర్క్‌ ఫ్రంహోంను తమ పాలసీలో భాగంగా చేశాయి. కేవలం రెండేళ్లలోనే ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. 

చదవండి: ఐటీ కంపెనీ 'యాక్షన్‌ స్టెప్‌' బంపరాఫర్‌, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు!

మరిన్ని వార్తలు