టీవీని అధిగమించనున్న డిజిటల్‌

16 Feb, 2022 03:59 IST|Sakshi

2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరణ

గ్రూప్‌ఎమ్‌ ఇండియా నివేదిక

2022లో ప్రకటనల వ్యయం

రూ.లక్ష కోట్లు దాటుతుందని అంచనా

ముంబై: టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్‌ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ  గ్రూప్‌ఎమ్‌ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ‘ దిస్‌ ఇయర్, నెక్ట్స్‌ ఇయర్‌’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్‌) అంచనాల  నివేదికను ఆవిష్కరించింది. నివేదిక ప్రకారం యాడ్‌ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుంది.

ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొత్తం మాధ్యమంలో డిజిటల్‌ షేర్‌ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటన ల వ్యయం 11% పెరిగి 850 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. డిజిటల్‌ వాటా ఇందులో 66%. భారత వినియోగదారు, పరిశ్రమ అభిరుచులను రూపుదిద్దే కొన్ని కీలక ధోరణులను కూడా గ్రూప్‌ఎమ్‌ తన నివేదికలో ప్రస్తావించింది. సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులు–స్థిరత్వం, డిజిటల్‌ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్‌ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్‌లైన్‌ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్‌ను సెట్‌ చేస్తాయని నివేదిక విశ్లేషించింది.  


 

మరిన్ని వార్తలు