గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌

18 Oct, 2021 06:22 IST|Sakshi

అందుబాటు ధరల్లో ఇళ్లు..

చౌక వడ్డీ రేట్ల ఊతం

న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత పెరగడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాల ఊతంతో హోమ్‌ లోన్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ తర్వాత హౌసింగ్‌కు డిమాండ్‌ పుంజుకోవడంతో పండుగ సీజన్‌ సందర్భంగా బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు 6.5 శాతానికే హోమ్‌ లోన్స్‌ అందిస్తున్నాయి. ‘గత కొన్నాళ్లుగా ఆదాయ స్థాయులు ఎంతో కొంత పెరగ్గా దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉండిపోయాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహాలు మరింత అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.

చౌక వడ్డీ రేట్లు కూడా గృహ రుణాలు తీసుకోవడానికి ఒక కారణంగా నిలుస్తున్నాయి. కోవిడ్‌–19 పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు కాస్త పెద్ద సైజు అపార్ట్‌మెంట్‌లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణు సూద్‌ కర్నాడ్‌ తెలిపారు. రెడీమేడ్‌ ఇళ్లకు మంచి డిమాండ్‌ ఉంటోందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ వై విశ్వనాథ గౌడ్‌ తెలిపారు. పండుగ సీజన్, ఆ తర్వాత కూడా రెడీమేడ్‌ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్‌ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు పలు బ్యాంకులు, పండుగ సీజన్‌కు ముందే గృహ రుణాల రేట్లను తగ్గించాయని  కోలియర్స్‌ ఇండియా కొత్త సీఈవో రమేష్‌ నాయర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు