కార్పొరేట్ల ఆదాయాల్లో ఆరు శాతం పురోగతి!

4 May, 2021 03:59 IST|Sakshi

కమోడిటీల రేట్ల హెచ్చుతగ్గులతో పరిమితంగానే లాభాలు 

2021–22పై ఇండ్‌–రా అంచనా

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ విజృంభణతో చాలా మటుకు పరిశ్రమలకు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్న నేపథ్యంలో 2019–20తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి సగటున 6 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఇండియా రేటింగ్స్‌ (ఇండ్‌–రా) వెల్లడించింది. అయితే, ఇది గతంలో అంచనా వేసిన 4.4 శాతం కన్నా అధికంగానే ఉంటుందని పేర్కొంది. అలాగే మహమ్మారి కారణంగా దాదాపు సగం పైగా సంవత్సరం లాక్‌డౌన్‌తోనే గడిచిపోయిన గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఆదాయ వృద్ధి ఏకంగా 21.2 శాతం స్థాయిలో నమోదు కాగలదని భావిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్‌ వివరించింది. రెండో వేవ్‌లో సర్వీస్‌ ఆధారిత రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని.. ఫలితంగా సదరు రంగం కోలుకోవాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి సమయం పట్టేస్తుందని ఇండ్‌–రా తెలిపింది. రేట్ల పెరుగుదల, డిమాండ్‌తో అమ్మకాల పరిమాణం పెరిగి చాలా మటుకు రంగాల ఆదాయాలు మెరుగ్గా ఉండటం వల్ల 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం బాగుంటుందని పేర్కొంది. అయితే, కమోడిటీల ధధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉండటం, రూపాయి క్షీణత వంటి అంశాల కారణంగా లాభాలు పరిమిత స్థాయిలోనే ఉండొచ్చని ఇండ్‌–రా వివరించింది. 

బడా కంపెనీల వృద్ధి జోరు.. 
చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీల వృద్ధి మరింత ఎక్కువగా ఉంటుందని ఇండ్‌–రా తెలిపింది. ఫార్మా, రసాయనాలు, సిమెంటు, ఉక్కు వంటి రంగాల సంస్థలు పెట్టుబడి వ్యయాలను కొంత పెంచుకునే అవకాశం ఉందని వివరించింది. కన్సాలిడేషన్‌ కారణంగా టెలికం రంగం ప్రయోజనం పొందగలదని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. సబ్సిడీల కారణంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు తగ్గి ఎరువుల రంగానికి లబ్ధి చేకూరగలదని వివరించింది. ఇక పటిష్టమైన జీడీపీ వృద్ధి ఊతంతో లాజిస్టిక్స్, పోర్టుల విభాగాలు మెరుగుపడగలవని తెలిపింది. డిమాండ్‌ పెరుగుదల.. ఐటీ, పేపర్‌ రంగాలకు సానుకూలమని పేర్కొంది. పరిశ్రమలు, వస్తు.. సేవలు, ఉక్కు, లాజిస్టిక్స్, సిమెంటు, నిర్మాణం, కమర్షియల్‌ రియల్టీ మొదలైన రంగాలు స్వల్పంగా మెరుగుపడగలవని ఇండ్‌–రా వివరించింది. అయితే, కమోడిటీల రేట్లు అధిక స్థాయిలో ఉండటం వల్ల చమురు.. గ్యాస్‌ రంగం క్షీణించవచ్చని అంచనా వేసింది. ఎయిర్‌లైన్స్, రెసిడెన్షియల్‌ రియల్టీ, హోటళ్లపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ద్వితీయార్థం దాకా ఇవి కోలుకోకపోవచ్చని తెలిపింది. 

మరిన్ని వార్తలు