భారత్‌పే వ్యవహారాలపై జీఎస్‌టీ దర్యాప్తు

10 Mar, 2022 05:53 IST|Sakshi

సేవల నకిలీ ఇన్వాయిస్‌లపైనా దృష్టి

గత నాలుగేళ్ల పుస్తకాల తనిఖీ

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే పన్ను ఎగవేతలపై జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. సేవలకు సైతం నకిలీ ఇన్వాయిస్‌లను జారీ చేశారా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోనుంది. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి కంపెనీ పుస్తకాలను తనిఖీ చేసే పనిలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడైన అష్నీర్‌ గ్రోవర్, అయన భార్య మాధురి జైన్‌ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కంపెనీ అంతర్గత దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. దీంతో గ్రోవర్‌ దంపతులను అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు భారత్‌పే ప్రకటించింది.

భారత్‌పే ఎటు వంటి ఉత్పత్తులు సరఫరా చేయకుండానే నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేయడంపై జీఎస్‌టీ అధికారులు గడిచిన ఏడాది కాలం నుంచి దర్యాప్తు నిర్వహిస్తుండడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు భారత్‌పే ప్రధాన కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. ‘‘సరుకుల సర ఫరా లేకుండానే ఇన్వాయిస్‌లు జారీ చేసిన కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సేవలు అందించకుండా ఇన్వాయిస్‌లు జారీ చేసినట్టు మాధురీ జైన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి ఆరోపణలు రావడంపై వాటిపైనా దృష్టి పెట్టనున్నాం’’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు