GST Collection: లక్షకోట్లు దాటేసింది!

2 Sep, 2021 07:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం.

కోవిడ్‌ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం.  జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్‌టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్‌టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది.  ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.  

వేర్వేరుగా ఇలా... 

 ►సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.20,522 కోట్లు 
 స్టేట్‌ జీఎస్‌టీ రూ.26,605 కోట్లు 
 ► ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్‌టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884       కోట్లుసహా) 
 ► సెస్‌ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా).  

అప్పడానికి జీఎస్‌టీ వర్తించదు 
కాగా అప్పడానికి జీఎస్‌టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర బోర్డ్‌ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్‌టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్‌టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్‌టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్‌ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్‌పీజీ  ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్‌ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది.

చదవండి: ఫేస్‌బుక్‌లో హింస ఈ రేంజ్‌లో ఉందా!?

మరిన్ని వార్తలు