జీఎస్టీ వసూళ్లు రయ్‌ రయ్‌

2 Oct, 2022 04:59 IST|Sakshi

సెప్టెంబర్‌లో రూ.1.47లక్షల కోట్ల వసూళ్లు

గతంతో పోలిస్తే 26 శాతం అధికం

తెలంగాణలో రూ.3,915 కోట్లు

ఏపీలో రూ.3,132 కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో జోష్‌ మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి వరసగా ఏడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. గడిచిన సెప్టెంబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లుగా ఉందని శనివారం కేంద్ర ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్‌ జీఎస్టీ రూ.25,271 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.80,464 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన మొత్తం రూ.41,215 కోట్లతో కలిపి), సెస్‌ రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.856 కోట్లతో కలిపి)గా నమోదయ్యాయి.

ఈ సెప్టెంబర్‌ వసూళ్లు.. గత ఏడాది సెప్టెంబర్‌ నెల వసూళ్లతో పోలిస్తే ఏకంగా 26 శాతం ఎక్కువ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు 22 శాతం ఎక్కువయ్యాయి. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఎనిమిదవ సారి. రూ.1.4 లక్షల కోట్ల మార్క్‌ దాటం ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే వరుసగా ఏడోసారి. ఈ ఏడాదిలో అత్యధిక సింగిల్‌ డే కలెక్షన్‌ జూలై 20న నమోదైంది. ఆ రోజు 9.58 లక్షల చలాన్‌ల ద్వారా రూ.57,846 కోట్లు వచ్చాయి. రెండో అత్యధిక సింగిల్‌ డే కలెక్షన్‌లు సెప్టెంబర్‌ 20న నమోదయ్యాయి.  

ఏపీలో 21 శాతం.. తెలంగాణలో 12 శాతం
జీఎస్టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు గణనీయ వృద్ధిని సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2,595 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 21 శాతం మేర పెరిగి రూ.3,132 కోట్లకు చేరిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది రూ.3,494 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 12శాతం మేర పెరిగి రూ.3,915 కోట్లకు పెరిగాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు