GST Council: సామాన్యులకు కేంద్రం భారీ షాక్..

29 Jun, 2022 08:46 IST|Sakshi

చండీగఢ్‌:మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్‌ లేదా లేబుల్‌  చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధిస్తారు. దీనితో ఆయా ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై కూడా జీఎస్‌టీ అమలవుతుంది.  

పన్నులను హేతుబద్ధీకరించే ఉద్దేశంతో మినహాయింపులను ఉపసంహరించుకోవడానికి సంబంధించి రాష్ట్రాల మంత్రుల బృందం (జీఓఎం) చేసిన సిఫార్సులను చాలావరకూ మండలి ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  ప్రారంభించిన సమయానికి (2017 జూలై 1) 14.4 శాతంగా ఉన్న సగటు జీఎస్‌టీ రేటు ప్రస్తుతం 11.6 శాతానికి పడిపోయిన నేపథ్యంలో దీనిని పెంచడానికి జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణ అవసరమని మండలి ప్రధానంగా భావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఇక్కడ  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో రెండు రోజుల కీలక జీఎస్‌టీ మండలి 47వ సమావేశం ప్రారంభమైంది. మొదటిరోజు సమావేశం మంత్రుల బృందం చేసిన పలు సిఫారసులను ఆమోదించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్యాక్డ్, లేబుల్డ్‌ ఆహార ఉత్పత్తులు పొందుతున్న పన్ను మినహాయింపులను తొలగించాలని సుదీర్ఘ చర్చ తర్వాత మండలి నిర్ణయించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. 

ఈ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మండలి నిర్ణయాలు ఇవీ...

ముందుగా ప్యాక్‌ చేసిన, లేబుల్‌ చేసిన మాంసం (ఘనీభవించిన స్థితిలోలేని పదార్ఘాలు మినహా), చేపలు, పెరుగు, పనీర్, తేనె, ఎండిన చిక్కుళ్ళు, ఎండిన మఖానా, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, మెస్లిన్‌ పిండి, బెల్లం, పఫ్డ్‌ రైస్‌ (మూరి) సంబంధిత అన్ని ఉత్పత్తులు, సేంద్రియ, కంపోస్ట్‌ ఎరువుకు ఇకపై జీఎస్‌టీ మినహాయింపు వర్తించదు. దీనిపై ఇకపై  5 శాతం పన్ను విధింపు ఉంటుంది. 

అదేవిధంగా చెక్కుల జారీకి (వదులుగా లేదా పుస్తక రూపంలో) బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తారు. అట్లాస్‌సహా మ్యాప్‌లు, చార్ట్‌లపై 12 శాతం లెవీ ఉంటుంది. 

ప్యాక్‌ చేయని, లేబుల్‌ లేని, బ్రాండెడ్‌ కాని వస్తువులపై జీఎస్‌టీ మినహాయింపు కొనసాగుతుంది.   

రోజుకు రూ. 1,000 కంటే తక్కువ ఉన్న హోటల్‌ గదులపై 12% పన్ను ఇకపై అమలవుతుంది.  ప్రస్తుతం ఇక్కడ పన్ను మినహాయింపు ఉంది. 

వంట నూనె, బొగ్గు, ఎల్‌ఈటీ ల్యాంప్స్, ప్రింటింగ్‌– డ్రాయింగ్‌ ఇంక్, ఫినిష్డ్‌ లెదర్‌ సోలా ర్‌ వాటర్‌ హీటర్‌తో సహా అనేక వస్తువుల విషయంలో ఇన్వర్టెడ్‌ డ్యూటీ వ్యవస్థలో సవరణను కూడా జీఎస్‌టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహారంసహా పలు కీలక అంశాలపై బుధవారం మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది.  

మరిన్ని వార్తలు