Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్‌ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో!

1 Aug, 2022 13:08 IST|Sakshi

PM Narendra Modi: జీఎస్టీ (GST) బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు ఇది సామాన్యుల బిల్లని వారికి ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. దీన్ని అమలు తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని మాటలు చెప్పారు నేతలు. అయితే జీఎస్టీ  మాత్రమే కాదు ఏది వచ్చినా ప్రజలపై బాదుడు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని తాజాగా మరోసారి నిరూపించింది కేంద్రం. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కొత్తగా కొన్ని నిత్యవసరాల వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. 

నిన్నటి వరకు ఎలా ఉన్నా, ప్రస్తుత పన్నుల ప్రభావం, ధరల భారం దెబ్బకు పసి పిల్లలు కూడా భయపడుతున్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఓ చిన్నారి లేఖ. ధరలు మండిపోతున్నాయని ఒకటో తరగతి చదివే ఓ బాలిక ఏకంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పాపం ఎంత కష్టం వచ్చిందో.. ఆ చిట్టి తల్లికి!

ఏముంది ఆ లేఖలో..
పేపర్‌, పెన్సిల్‌ తీసుకొని నేరుగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. మీరు ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా? అని ప్రశ్నించింది. "నా పేరు కృతి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మోదీజీ, మీరు విపరీతంగా ధరల పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నా పెన్సిల్, రబ్బరు (ఎరేజర్) కూడా ఖరీదైనవిగా మారిపోయాయి. అంతేనా నా మ్యాగీ ధర కూడా పెరిగింది.

స్కూల్లో ఎవరో నా పెన్సిల్‌ని దొంగిలించారు. ఇప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. పెన్సిల్ అడుగుతున్నారు. నేను ఏమి చేయాలి? మీరే చెప్పండంటూ నేరుగా ప్రధానికే లేఖ పేరుతో తన బాధని అక్షరాల రూపంలో రాసి పంపింది. కాగా ఈ చిన్నారి యూపీలోని కనౌజీ జిల్లాలో చదువుకుంటోంది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్‌గా మారి నెట్టింట హల్‌ చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలనే మాత్రమే కాదు పసి పిల్లలను కూడా కదిలిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్‌ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో!

మరిన్ని వార్తలు