GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డు

5 Jun, 2021 20:56 IST|Sakshi

లక్ష కోట్లు దాటిన పన్ను వసూళ్లు

మేలో రూ. 1.02 లక్షల కోట్ల ఆదాయం

గతేడాదితో పోల్చితే 65 శాతం అధికం

వెబ్‌డెస్క్‌: కరోనా కష్టకాలంలోనూ కేంద్రానికి దండిగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో మే నెలలో గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) ద్వారా లక్షా రెండు వేల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది మేలో వచ్చిన జీఎస్టీ ఆదాయంతో పోల్చితే ఇది 65 శాతం అధికం. జీఎస్టీ పన్ను వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది.

వరుసగా ఎనిమిదో సారి
కరోనా సెకండ్‌ సంక్షోభం గడిచిన మూడు నెలలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్నా జీఎస్టీ వసూళ్లకు ఢోకా రాలేదు. గత ఎనిమిది నెలలుగా జీఎస్టీ  వసూళ్లు లక్ష కోట్లను దాటుతున్నాయి. ఫస్ట్‌వేవ్‌ ముగిసిన తర్వాత  పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయి. అక్టోబరు నుంచి మే వరకు ఇలా వరుసగా ఎనిమిది నెలల పాటు ప్రతీ నెల లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 

లాక్‌డౌన్‌ ప్రభావం
కరోనా సెకండ్‌ వేవ్‌ మార్చిలో మొదలైతే ఏప్రిల్‌లో దేశం మొత్తాన్ని చుట్టేసింది. దీంతో మే నెలలలో దాదాపు దేశంమంతటా లాక్‌డౌన్‌ అమలైంది. దీని ప్రభావం పన్ను వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్‌లో జీఎస్‌టీ ద్వారా 1.41 లక్షల కోట్ల ఆదాయం రాగా మే నెలలో దాదాపు 41 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయి రూ. 1.02 లక్షల కోట్ల ఆదాయమే వచ్చింది. అయితే 2020 మేతో పోల్చితే ఆర్థిక వ్యవస్థపై కరోనా , లాక్‌డౌన్‌ ప్రభావం తగ్గింది. కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పస్టం చేస్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు