వేతన జీవులూ.. జర జాగ్రత్త!

26 Apr, 2021 14:45 IST|Sakshi

► వేతన జీవులకు జీతభత్యాల మీద వారి యజమాని ప్రతి నెలా టీడీఎస్‌ కొంత చేసి, ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. అలా జమ చేసిన తర్వాత ఆ సమాచారం అంతా ఫారం 26 ఏఎస్‌లో పొందుపర్చబడుతుంది. ఇందులో ఎప్పటికప్పుడు సమాచారం చేరుస్తుంటారు. ముందుగా ఉద్యోగస్తులు వారి ఆదాయ వివరాలు, సేవింగ్స్‌ వివరాలు ఇవ్వాలి. యజమాని నికర ఆదాయాన్ని లెక్కించి, పన్ను భారం లెక్కించి పన్నెండు సమాన భాగాలుగా ప్రతి నెలా జమ చేయాలి. కానీ అలా జరగడం లేదు. బదులుగా చివరి 3-4 నెలల్లో చేస్తున్నారు. జీతం, పెన్షన్‌ మీద టీడీఎస్‌ వర్తింపచేయడం జరుగుతుంది. జాగ్రత్తగా సమాచారం ఇవ్వండి.  

► ఉద్యోగి తనకి వచ్చే ఇతర ఆదాయపు వివరాలు యజమానికి తెలియజేస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించి, రికవరీ చేయాలి. 

► ఏదైనా కారణం వల్ల వేతన జీవులు ఇతర ఆదాయం గురించి యజమానికి చెప్పలేకపోయిన పక్షంలో వారే స్వయంగా అలాంటి ఆదాయాలన్నింటినీ లెక్కించి, జీతం మీద ఆదాయంతో కలిపి మొత్తం పన్ను భారాన్ని లెక్కించాలి. అందులో నుంచి టీడీఎస్‌ని తగ్గించి, మిగతా భారాన్ని 2022 మార్చిలోగా చెల్లించాలి. 

► జీతం కాకుండా వేతన జీవులకి బ్యాంకు వడ్డీ, ఫిక్సిడ్‌ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రావచ్చు. ఇలాంటి ఆదాయం మీద కేవలం 10 శాతం టీడీఎస్‌ వర్తింపచేస్తారు. మీరు శ్లాబును బట్టి అదనంగా 10 శాతం నుంచి 20 శాతం దాకా చెల్లించాల్సి రావచ్చు. 

► అలాగే ఇంటి అద్దె. దీని మీద టీడీఎస్‌ జరగవచ్చు లేదా జరగకపోనూ వచ్చు. ఒకవేళ జరిగినా నిర్దేశిత స్థాయి పన్ను భారానికి సరిపోకపోవచ్చు.. తేడా ఉండొచ్చు. అటువంటి తేడాలేమైనా ఉంటే సకాలంలో చూసుకుని పన్నుని చెల్లించాలి. 

► క్యాపిటల్‌ గెయిన్స్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. కొన్ని సందర్భాల్లోనే టీడీఎస్‌ వర్తిస్తుంది. (అమ్మకపు విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్‌ చేయాలి) వేతన జీవులు స్వయంగా వాళ్ల క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కించి పన్ను భారం చెల్లించాలి. లావాదేవీ జరిగిన తేదీ తర్వాత వచ్చే త్రైమాసికంలో పన్ను చెల్లించాలి. అలా చేయకపోతే వడ్డీ చెల్లించాలి. 

► ఇంకేదైనా ఇతర ఆదాయం కూడా ఉండి ఉండవచ్చు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  

► అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వర్తించే పరిస్థితి వస్తే.. ప్రతి మూడు నెలలకు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వాయిదాల ప్రకారం చెల్లించేయాలి. గడువు తేదీ దాటితే కొన్ని సందర్భాల్లో వడ్డీ పడుతుంది కాబట్టి మీ సంవత్సర ఆదాయాన్ని సేవింగ్స్‌ను ముందుగా లెక్కించండి. నికర ఆదాయం మీద పన్ను భారాన్ని టీడీఎస్‌ ద్వారా, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ ద్వారా చెల్లించండి.

ట్యాక్సేషన్‌ నిపుణులు:

కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి
కె.వి.ఎన్‌ లావణ్య

చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు