17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా!

3 Dec, 2022 18:32 IST|Sakshi

గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే దేశ సమగ్ర అభివృద్ధిలో అవే కీలకంగా కాబట్టి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే కొన్ని పల్లెటూర్లు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండగా, మరికొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. కొన్ని మాత్రం పేరుకే గ్రామాలుగా ఉన్నా  రోడ్లు, తాగునీరు, భవంతులు, కరెంట్‌ సౌకర్యం ఇలా ప్రజలకు కావాల్సిన వసతులతో పట్టణాలను తలపిస్తున్నాయి.

అటువంటి గ్రామాల్లో ఒకటి మన దేశంలోనే ఉంది. ఇది మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఆ ఊరుని చూస్తే పల్లెటూరు అంటే నమ్మరు. లగ్జరీ ఇళ్లు.. కార్లు, విశాలమైన రోడ్లుతో, బ్యాంకులు, కోట్ల సంపద.. ఖరీదైన హంగులతో అలరారుతుంది. అలా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో మాదాపర్ అనే గ్రామం ప్రపంచంలోనే సంపన్న గ్రామంగా నిలిచింది.

దేశానికే ఆదర్శం.. ఈ గ్రామం
ఆ గ్రామం గురించి పూర్తి వివరాలు తెలిస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. సాధారణంగా పల్లెటూరులో అభివృద్ధి అంటే.. బ్యాంకు, చిన్నపాటి ఆస్పత్రి, బస్సు, విద్యుత్త్‌ సౌకర్యం, రోడ్డు ఇలా ఉంటాయి. కానీ గుజరాత్‌లోని మదాపర్‌ గ్రామం వీటన్నికంటే భిన్నమైంది. అక్కడ ఏకంగా 17 బ్యాంకులు,  అందులో 5 వేల కోట్లకు పైగా డిపాజిట్‌ ఉన్నాయంటే.. దీని బట్టి ఆ ఊరంతా కోటీశ్వరులే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. దాదాపు అక్కడ 7600 గృహాలు ఉన్నాయి.

శ్రీమంతుడు తరహాలో..
ఆ గ్రామంలో ప్రజలు కెనడా, యూకే, అమెరికా, గల్ఫ్‌ అంటూ పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు, వాపారాలు చేస్తూ బాగా ఆర్జిస్తున్నారు. వారి సంపాదనలోంచి తిరిగి తమ ఊరిలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. కాలక్రమేనా వారి పంపుతున్న డబ్బులతో అక్కడ కార్పొరేట్ స్కూళ్లు,  చెరువులు, పార్కులు, డ్యామ్‌లు, ఆసుప​త్రులు, దేవాలయాలు ఏర్పాటయ్యాయి. ఈ ఎన్నారైలలో చాలామంది అప్పుడప్పుడు గ్రామాలకు తిరిగి వస్తుంటారు. నివేదికల ప్రకారం, మాదాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థ 1968లో లండన్‌లో స్థాపించబడింది.

ఇది విదేశాలలో నివసిస్తున్న మాదాపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేస్తుంది. ప్రజల మధ్య మృదువైన కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇదే విధమైన కార్యాలయం ప్రారంభించారు. మరో విషయం ఏంటంటే ,ఆ గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ దాదాపు 15 లక్షలుగా ఉందట. అలా అందరి సహకారముతో అభివృద్ధిలో దూసుకుపోతున్న మాదాపర్ గ్రామం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

చదవండి: 19 ఎకరాలు.. దేశంలోనే పెద్ద మాల్‌.. ఎక్కడో తెలుసా!

మరిన్ని వార్తలు