స్టార్టప్‌లకు గుజరాత్‌ బెస్ట్‌!

6 Jul, 2022 07:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అనువుగా స్టార్టప్‌ వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంలో గుజరాత్, కర్ణాటక మరోసారి అత్యుత్తమంగా నిల్చాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) రూపొందించిన ఉత్తమ పెర్ఫార్మర్‌ జాబితాలో గుజరాత్‌ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ కేటగిరీలో కర్ణాటకకు కూడా చోటు లభించింది.

రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌ 2021 జాబితాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సోమవారం విడుదల చేశారు. స్టార్టప్‌లపరంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్‌ .. అగ్రస్థానానికి చేరాలన్న లక్ష్య సాధన దిశగా అంతా కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాల స్థాయిలో కూడా పోటీపడాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) తమ తమ స్టార్టప్‌ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో తోడ్పాటు అందించేందుకు ఈ ర్యాంకింగ్‌ విధానాన్ని ఉద్దేశించారు.  

అయిదు కేటగిరీలు.. 
సంస్థాగత మద్దతు, నవకల్పనలకు ప్రోత్సాహం, నిధులపరమైన తోడ్పాటు తదితర ఏడు అంశాల్లో సంస్కరణలకు సంబంధించి 26 యాక్షన్‌ పాయింట్లను పరిగణనలోకి తీసుకుని డీపీఐఐటీ ఈ ర్యాంకులను మదింపు చేసింది. 24 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. 

ఉత్తమ (బెస్ట్‌) పెర్ఫార్మర్లు, టాప్‌ పెర్ఫార్మర్లు, లీడర్లు, వర్ధమాన లీడర్లు, వర్ధమాన స్టార్టప్‌ వ్యవస్థలు అంటూ అయిదు కేటగిరీల్లో ఆయా రాష్ట్రాలు, యూటీలను వర్గీకరించారు. దీని ప్రకారం ఉత్తమ వర్ధమాన స్టార్టప్‌ వ్యవస్థల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, బీహార్, మిజోరం, లడఖ్‌ ర్యాంకులు దక్కించుకున్నాయి. అలాగే టాప్‌ పెర్ఫార్మర్లలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్‌లకు ర్యాంకులు దక్కాయి. కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాల్లో మేఘాలయా బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా నిల్చింది.

మరిన్ని వార్తలు