హెచ్‌1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్‌ షాక్‌

1 Jan, 2021 13:48 IST|Sakshi

నిషేధం మరో 3 నెలలపాటు పొడిగింపు

ఆదేశాలు జారీ చేసిన యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌

ప్రధానంగా భారత ఐటీ నిపుణులకూ, కంపెనీలకూ దెబ్బ

వాషింగ్టన్‌: దేశీ టెక్‌ నిపుణులు, ఐటీ కంపెనీలకు షాక్‌నిస్తూ హెచ్‌1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీసాల జారీకి మార్చి నెలాఖరువరకూ వీలుకాదని సంబంధితవర్గాలు తెలియజేశాయి. సుమారు 8 నెలలుగా హెచ్‌1 బీ, తదితర వర్క్‌ వీసాలపై ఆంక్షలను విధించిన ట్రంప్‌ తాజాగా మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగల కారణాలపై ట్రంప్‌ యథాప్రకారం పాత పల్లవినే ఎత్తుకున్నారు. కోవిడ్-19 వల్ల ఉపాధి మార్కెట్‌తోపాటు.. అమెరికా ప్రజల ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ట్రంప్‌ తాజాగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ అమెరికన్ల జీవితాలకు విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌లో నిరుద్యోగిత 6.7 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్‌లో నమోదైన గరిష్టంతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఇప్పటికీ పలువురు ఉపాధి కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఉపాధి మార్కెట్‌, ప్రజా ఆరోగ్యాల విషయంలో పరిస్థితులు మెరుగుపడలేదని వివరించారు. చదవండి: (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు)
 
ఏప్రిల్‌ నుంచీ
హెచ్‌1 బీ, తదితర వీసాల జారీపై ట్రంప్‌ 2019 ఏప్రిల్‌ 22న తొలిసారి నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై జూన్‌ 22న 6 నెలలపాటు నిషేధాన్ని పొడిగించారు. దీంతో డిసెంబర్‌ 31కల్లా గడువు ముగియనుండటంతో తాజాగా మరో మూడు నెలలు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మార్చి 31వరకూ నిషేధం అమలుకానుంది. ఫలితంగా భారీ సంఖ్యలో భారత ఐటీ నిపుణులు, పలు అమెరికన్‌, దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2021 ఏడాదికిగాను జారీ అయిన హెచ్‌1బీ వీసాలకు స్టాంపింగ్‌కు మార్చి నెలాఖరు వరకూ వేచిచూడవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్‌లో పనిచేసేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలు హెచ్‌1బీ వీసాల ద్వారా ఐటీ నిపుణులను ఎంపిక చేసుకునే సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జారీ అయ్యే హెచ్‌1బీ వీసాలను భారతీయులే అత్యధికంగా పొందుతుంటారు. కాగా.. ట్రంప్‌ తాజా నిర్ణయంతో ఇప్పటికే గడువు తీరిన హెచ్‌1బీ వీసాల రెన్యువల్‌ సైతం పెండింగ్‌లో పడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (కోవిడ్‌-19లోనూ దిగ్గజాల దూకుడు)

మరిన్ని వార్తలు