హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ జర్నీ సగం పూర్తి

7 Oct, 2022 09:10 IST|Sakshi

ముంబై: డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కార్యక్రమం సగం పూర్తయినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటించింది. రెండేళ్ల క్రితం దీన్ని బ్యాంకు చేపట్టగా.. టెక్నాలజీపై చేసే వ్యయాలు ఆదాయంలో నిర్ణీత శాతానికి చేరాయని, ఇకమీదట ఇంతకుమించి నిధుల అవసరం ఉండదని పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ సేవల విషయంలో కస్టమర్లు తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకోవడం తెలిసిందే. కొత్త క్రెడిట్‌ కార్డులు విక్రయించకుండా, కొత్త డిజిటల్‌ సేవలు, సాధనాలు ఆరంభించకుండా నిషేధం విధించింది. దిద్దుబాటు చర్యలతో తర్వాత నిషేధాన్ని ఎత్తివేసింది. డిజిటల్‌కు మారే క్రమంలో 50–60 శాతం పని పూర్తయినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేమెంట్స్, టెక్నాలజీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ హెడ్‌ పరాగ్‌రావు తెలిపారు.

బ్యాంకుకు సంబంధించి ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. టెక్నాలజీపై చేసే వ్యయాల విషయంలో గరిష్ట స్థాయిని చేరుకున్నామని చెప్పారు. 2018 నుంచి చూస్తే డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని.. దీంతో అప్పటి వరకు ఉన్న బ్యాంకింగ్‌ సదుపాయాలు వాటిని తట్టుకోలేకపోయినట్టు బ్యాంకు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి రమేశ్‌ లక్ష్మీనారాయణన్‌ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు