Happy Birthday Nagarjuna: వెండితెరకు మన్మథుడు.. బిజినెస్‌లో ‘బాస్‌’

29 Aug, 2021 10:38 IST|Sakshi

Happy Birthday Akkineni Nagarjuna: ‘మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.’.. నటుడు తెలుగు వెండితెర తొలి సొగ్గాడు శోభన్‌ బాబు తర్వాతి తరాల తారల కోసం ఇచ్చిన సందేశం ఇది. ఇలాంటివేం ఫాలో కాకుండా.. సోకులకు పోయి డౌన్‌ఫాల్‌ అయినవాళ్లు సినీ పరిశ్రమలో చాలామందే ఉన్నారు. అయితే ఆ సోగ్గాడి మాటలను ఒంటబట్టించుకుని ఈ సొగ్గాడే చిన్ని నాయన ఒక్క వెండితెరనే కాదు బుల్లితెర, స్టూడియో ఓనర్‌, రియల్‌ ఎస్టేట్‌, స్పోర్ట్స్‌ టీమ్స్‌ కో ఓనర్‌గా అనేక రంగాలకు విస్తరించి  క్లాస్‌ బిజినెస్‌కు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారారు.     

ముందే పసిగట్టారు
టాలీవుడ్‌లో ‘మన్మథుడు’ అనే పదానికి పర్యాయ పదంగా  ఉన్న అక్కినేని నాగార్జున.. ఆరు పదుల వయసులోనూ ఆ ట్యాగ్‌ లైన్‌కు జస్టిఫికేషన్‌ చేస్తున్నారాయన. సినిమాలతోనే కాదు.. బుల్లెతెర మీదకు ఎర్లీ ఎంట్రీ ఇచ్చింది కూడా ఆయనే. అప్‌కమింగ్‌ స్టేజీలో ఉన్నప్పుడే మాటీవీలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మా టీవీ రేంజ్‌ ఏంటో అందరికీ తెలిసిందే. పెట్టుబడులతోనే కాదు బుల్లితెరపైనా నాగ్‌ తన హోస్టింగ్‌తో ఆడియొన్స్‌పై మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. అప్పుడెప్పుడో యువ సీరియల్‌తో నిర్మాతగా బుల్లితెరపై అడుగుపెట్టిన నాగ్‌.. ఆపై మీలో ఎవరు కోటీశ్వరుడు?తో స్మాల్‌స్క్రీన్‌పై విశ్వరూపమే ప్రదర్వించారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ లాంటి రియాలిటీ షోల టీఆర్పీ రేటింగ్‌లు చాలూ.. నాగ్‌ క్రేజ్‌ ఏంటో మచ్చుకు చెప్పుకోవడానికి.

 

అదే ఆయన బలం. అందుకే ఎండార్స్‌మెంట్స్‌
ట్రాజెడీ కింగ్‌, రొమాంటిక్‌ హోరోగా అక్కినేని హీరోలకు ఇమేజ్‌ని పెర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌ చేశారు. ఫలితంగా మహిళల్లో  నాగ్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇది గమనించే తెలివిగా నాగ్‌ను ఎండోర్స్‌మెంట్‌ వెపన్‌గా వాడుకుంటున్నాయి పలు కంపెనీలు. నాగ్‌ను యాడ్‌ల ద్వారా చూపించి.. వాళ్లను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఆ కోవలోనే కళ్యాణ్‌ జువెల్లర్స్‌, సౌతిండియా షాపింగ్‌మాల్‌,  ఘడీ డిటర్జెంట్‌తో పాటు స్పోటిఫై లాంటి ఎనర్జిటిక్‌ యాడ్‌లతో మెప్పించారు.

టీవీ స్పేస్‌లో నాగ్‌ ఉన్నాడంటే.. ఆ రిచ్‌నెస్‌ వేరేలా ఉంటుంది. డిటర్జెంట్‌ పౌడర్‌ నుంచి నగల యాడ్స్‌ దాకా.. మహిళలు బేస్డ్‌గా ఉండే ఉత్పత్తుల్లో చాలావాటికి ఎండోర్స్‌మెంట్‌ చేశారు. యాడ్‌ల కోసం రాసే స్క్రిప్ట్ ను డైరెక్షన్‌తో సంబంధం లేకుండా మరింత డ్రమటిక్‌గా మార్చడం , ఎమోషన్స్‌తో ప్రజెంట్‌ చేయడం నాగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ వయసులోనూ ఆయన ఎండోర్స్‌మెంట్‌ కింగ్‌గా రాణిస్తున్నాడు.

 

మూవీస్‌ ప్లస్‌ స్పోర్ట్స్‌
సినిమాలు, ఆటలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దీన్ని పసిగట్టిన వెండితెర హీరోల్లో నాగార్జున అగ్రస్థానంలో ఉంటారు. ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు అనేక జట్లకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. 2013 నుంచి ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ‘ముంబై మాస్టర్స్‌’కు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌తో కలిసి, మరోవైపు మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి మహీ రేసింగ్‌ టీం ఇండియాకు, ఇంకోవైపు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ క్లబ్‌లో కేరళ బ్లాస్టర్‌ ఎఫ్‌సీకి సహ యాజమానిగా ఉన్నాడు నాగ్‌.
 

రియల్‌ బిజినెస్‌మ్యాన్‌
అక్కినేని నాగార్జున గతంలో రెండుసార్లు ఫోర్బ్స్‌ టాప్‌ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రొడక్షన్‌ కంపెనీ అన్నపూర్ణ స్టూడియోస్‌కి నాగార్జున అక్కినేని కో-ఓనర్‌. ఈ స్టూడియో అనుబంధంగా ఇంటర్నేషనల్‌స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాకు ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అంతేనా భార్య అమల అక్కినేనితో కలిసి బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎన్జీవోను నడిపిస్తున్న నాగ్‌.. ఎయిడ్స్‌ అవేర్‌నెస్‌ ప్రచార కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
 

పర్‌ఫెక్ట్‌ బ్యాలెన్సింగ్‌
ఓవైపు హీరోగా సినిమా కెరీర్‌ మరోవైపు ఎండోర్స్‌మెంట్‌లు, వ్యాపారాలతోనూ బిజినెస్‌ ‘కింగ్‌’ అనే ట్యాగ్‌ లైన్‌కు వందకు వంద శాతం న్యాయం చేస్తున్నారాయన. హీరోల్లో నాగ్‌ మొదటి నుంచి డిఫరెంట్‌ రూట్‌లోనే ప్రయత్నాలు చేస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగ్‌కు ఉన్న పాషన్‌ అండ్‌ ఎనర్జీ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే ఆయనకి ప్యాన్‌ ఇండియా గుర్తింపు తెచ్చిపెట్టింది. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా నిలిపింది.

చదవండి: కక క్లాస్‌.. మమ మాస్‌

మరిన్ని వార్తలు