Happy Teacher's Day: ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?

5 Sep, 2021 11:21 IST|Sakshi

Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు.  శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్‌’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్‌ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల  ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


సుందర్‌ పిచాయ్‌(పిచాయ్‌ సుందరరాజన్‌).. 49 ఏళ్ల ఈ టెక్‌ మేధావి అల్ఫాబెట్‌ బోర్డ్ ఆఫ్‌ డైరెక్టర్స్‌గా, గూగుల్‌ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుందర్‌ పిచాయ్‌.. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్‌ విన్సెంట్‌ క్యాంప్‌బెల్‌ జూనియర్‌. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్‌ క్యాంప్‌బెల్‌.. మొదట్లో ఫుట్‌బాల్‌ కోచ్‌ కూడా. 

ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్‌ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్‌ పిచాయ్‌.. అంతకంటే ముందు గూగుల్‌ ఫౌండర్లు ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌, ఎరిక్‌ షిమిడెట్‌, జెఫ్‌ బెజోస్‌(అమెజాన్‌ బాస్‌), జాక్‌ డోర్సే, డిక్‌ కోస్టోలో(ట్విటర్‌), షెరీల్‌ శాండ్‌బర్గ్‌(ఫేస్‌బుక్‌) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్‌ కూడా. ఇక యాపిల్‌ ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్‌ క్యాంప్‌బెల్‌. 


మార్క్‌ జుకర్‌బర్గ్‌
.. ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ కమ్‌ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్‌గా ఎదిగిన ఈ ఇంటర్నెట్‌ ఎంట్రెప్రెన్యూర్‌.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్‌ మేధావి స్టీవ్‌ జాబ్స్‌. అవును.. ఈ విషయాన్ని స్టీవ్‌ జాబ్స్‌ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్‌ జాబ్స్‌ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్‌ టాక్‌ షోలో జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు.


రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్‌ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు, బ్రిటన్‌ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్‌ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్‌.​ 


సత్య నాదెళ్ల
.. మైక్రోసాఫ్ట్ చైర్మన్‌, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్‌ ఎదుగుదలకు గేట్స్‌ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్‌ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల.  
 

రతన్ నవల్ టాటా(రతన్‌ టాటా)
.. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్‌. ప్రస్తుతం టాటా చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్‌ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్‌ జహంగీర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా(జేఆర్‌డీ టాటా)ని.


ఎలన్‌ మస్క్‌
.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్‌ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్‌ఎక్స్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారాలను చూసుకునే  జిమ్‌ కాంట్రెల్‌ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్‌ రాకెట్‌ సైన్స్‌ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్‌ సైంటిస్ట్‌-గూగుల్‌ ఫౌండర్‌ ల్యారీ పేజ్‌తో దగ్గరగా ఎలన్‌మస్క్‌ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్‌ రాటుదేలాడని.


బిల్‌ గేట్స్‌.
. వ్యాపార మేధావిగా పేరున్న బిల్‌గేట్స్‌కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్‌ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్‌గేట్స్‌ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ  వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. 

- సాక్షి, వెబ్‌డెస్క్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు