హార్లీ డేవిడ్‌సన్‌ కొనసాగుతోంది...!

21 Nov, 2020 14:57 IST|Sakshi

2021 జనవరి నుంచి యథావిధిగా సర్వీసులు

అమ్మకాలు, విడిభాగాలు, సర్వీసులు అందుబాటులో

తాజాగా స్పష్టం చేసిన హార్లీ డేవిడ్‌సన్‌ గ్రూప్‌

హీరో మోటోకార్ప్‌తో జత- కొత్త బైకుల విడుదలకూ రెడీ

న్యూఢిల్లీ, సాక్షి: లగ్జరీ బైకులను ఇష్టపడేవారికి శుభవార్త! హార్లీ డేవిడ్‌సన్‌ దేశీయంగా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. వెరసి 2021 జనవరి నుంచి అమ్మకాలు, విడిభాగాలు, సర్వీసులు తదితరాలను ఎప్పటిలాగే అందించనున్నట్లు తెలియజేసింది. సుమారు రెండు నెలల క్రితం డిసెంబర్‌కల్లా దేశీ మార్కెట్ల నుంచి వైదొలగనున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం విదితమే. దేశీయంగా తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు సెప్టెంబర్‌ చివరి వారంలో కంపెనీ తెలియజేసింది. కాగా.. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు.. ఇతర బిజినెస్‌లను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

హీరో మోటోతో జత
దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో ఇప్పటికే హార్లీ డేవిడ్‌సన్‌ భాగస్వామ్యం, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా హార్లీ డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిళ్ల విక్రయాలు, సర్వీసింగ్‌ బాధ్యతలను హీరో మోటో నిర్వహించనుంది. అంతేకాకుండా విడిభాగాలు, కంపెనీ సంబంధ యాక్సెసరీస్‌, దుస్తులు తదితరాల అమ్మకాలను సైతం చేపట్టనుంది.  హీరో మోటోతో ఒప్పందం‍ ప్రకారం కొత్త మోడళ్లను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు హీరో మోటో, హార్లీ డేవిడ్‌సన్‌కుగల డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను రెండు కంపెనీలూ వినియోగించుకోనున్నాయి.

ప్రణాళికలో మార్పులు
ప్రస్తుతం దేశీ మార్కెట్లకు సంబంధించి బిజినెస్‌ మోడల్‌ ప్రణాళికలను సవరించుకున్నట్లు హార్లీ డేవిడ్‌సన్‌ ఇండియా, వర్ధమాన మార్కెట్ల ఎండీ సంజీవ్‌ రాజశేఖరన్‌ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప్‌తో కలసి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు హీరో మోటోతో కలసి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు ఈ అంశాలపై జనవరి నుంచి అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ దేశీయంగా హార్లీ ఓనర్స్‌ గ్రూప్‌(హెచ్‌వోజీ) కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్లు డిసెంబర్‌వరకూ కొనసాగుతారని.. తదుపరి కొత్త డీలర్‌షిప్స్‌ను ప్రకటించగలమని పేర్కొన్నారు.

డీలర్ల అసంతృప్తి
దేశవ్యాప్తంగా హార్లీ డేవిడ్‌సన్‌కు 33 ప్రత్యేక డీలర్‌షిప్స్‌ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. హార్లీ డేవిడ్‌సన్‌ దేశీయంగా కార్యకలాపాల నిలిపివేతకు నిర్ణయించుకున్న నేపథ్యంలో డీలర్లకు చెల్లించనున్న నష్టపరిహారం మరీ తక్కువగా ఉన్నట్లు పలువురు డీలర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశాయి. డీలర్‌షిప్స్‌పై వెచ్చించిన పెట్టుబడులతో పోలిస్తే తాము భారీగా నష్టపోయే అవకాశమున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో కొంతమంది డీలర్లు ఏజెడ్‌బీ అండ్‌ పార్టనర్స్‌ను న్యాయ సలహాల కోసం ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం!

మరిన్ని వార్తలు