ఇందిరా గాంధీ, జేఆర్‌డీ టాటా మధ్య ఆసక్తికర లేఖ..!

20 Jul, 2021 16:30 IST|Sakshi

మాజీ ప్రధాని​ ఇందిరాగాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1966 నుంచి 1977 వరకు మూడు పర్యాయాలు, 1980లో నాలుగో సారి ప్రధానమంత్రిగా పనిచేశారు. పలు రాజకీయ నేతలు  ఇందిరాగాంధీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలనే ఉద్ధేశ్యంతో ఇందిరా హటావో అనే నినాదంతో ప్రచారం చేస్తే..వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి గరీబీ హటావో అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన నేర్పరి ఇందిరాగాంధీ. తన నాయకత్వంలో పలు విప్లవత్మాక నిర్ణయాలను తీసుకున్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ, దేశంలో పంటల ఉత్పత్తి పెంచడం కోసం హరిత విప్లవం, 20 సూత్రాల పథకము వంటి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారు. 

తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త,  ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష గోయోంకా ఆసక్తికర ఉత్తరాన్ని మంగళవారం రోజున ట్విటర్‌లో షేర్‌ చేశారు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, పలు టాటా సంస్థల వ్యవస్తాపకుడు జేఆర్‌డీ టాటాకు  1973 జూలై 5 న ఉత్తరాన్ని రాశారు. అంతకుముందు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి జేఆర్‌డీ టాటా తన కంపెనీకు చెందిన పర్ఫ్యూమ్‌ బాటిళ్లను పంపారు.

ఇందిరా గాంధీ తన లేఖలో బదులుగా... ‘డియర్‌ జే.. మీరు పంపిన పర్ఫ్యూమ్స్‌తో ఆశ్చర్యానికి గురైయ్యాను. పర్ఫ్యూమ్స్‌ను పంపినందుకు ధన్యవాదాలు. సాధారణంగా నేను పర్ఫ్యూమ్‌లను వాడను. అలాంటి వాటికి దూరంగా ఉంటాను . మీరు పంపినందుకు ఒకసారి ట్రై చేస్తాను. మీరు అనుకూలమైన లేదా విమర్శనాత్మకమైన అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మోహమాట పడకుండా నన్ను సంప్రదించవచ్చున’ని ఇందిరా గాంధీలో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయోంకా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘శక్తివంతమైన  ప్రధానమంత్రి, దిగ్గజ పారిశ్రామికవేత్త మధ్య జరిగిన వ్యక్తిగత లేఖ. పరిపూర్ణ స్థాయి.’ అంటూ రాసుకొచ్చారు.  కాగా ప్రస్తుతం ఈ లేఖ పునరుద్ధరించిన బాంబే హౌజ్‌లో  ప్రదర్శనగా ఉంది.

మరిన్ని వార్తలు