ఐపీఎల్‌ రేటింగ్స్‌ ఎందుకు తగ్గాయ్‌! విశ్లేషించిన బిజినెస్‌ మ్యాగ్నెట్‌

21 Apr, 2022 12:46 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించే కార్పోరేట్‌ కంపెనీలు తమ బ్రాండ్‌ ప్రమోషన్‌కి సరైన వేదికగా భావించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రేటింగ్స​ ఈ సీజన్‌లో దారుణంగా పడిపోయాయి. గతేడాదితో పోల్చితే 15 నుంచి 40 ఏళ్ల వయసులో వివిధ కేటగిరీల్లో సగటున 30 శాతం పైగానే వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. దీనిపై సియట్‌ టైర్స్‌ చైర్మన్‌ ప్రముఖ బిజినెస్‌ మ్యాగ్నెట్‌ హార్స్‌ హార్ష్‌ గోయెంకా స్పందించారు. 

ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ తగ్గడానికి హర్ష్‌ గోయెంకా తెలిపిన కారణాలు
- ఎక్కువ మంది అభిమానుల మద్దతు ఉన్న ముంబై ఇండియన్స్‌, చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట​‍్లు వరుసగా ఓటమి పాలవుతుండటం
- విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, మహేంద్రసింగ్‌ ధోని  వంటి దిగ్గజాలు కూడా వరుసగా ఫెయిల్‌ అవుతుండటం
- చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ లేకుండా నీరసంగా ముగుస్తుండటం
- ఎక్కువ మ్యాచ్‌లు ముంబై రీజియన్‌లో జరపడం వల్ల గ్యాలరీల్లో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం
- కరోనా కారణంగా రెండేళ్ల పాటు టీవీలు, కం‍ప్యూటర్లకు అతుక్కుపోయిన జనాలు ఇప్పుడు ఎక్కువగా బయట తిరగాలి అనుకోవడం వల్ల ఈసారి ఐపీఎల్‌ రేటింగ్స్‌ తగ్గిపోయినట్టు హర్ష్‌ గోయెంకా వివరించారు.

ఐపీఎల్‌ తాజా సీజన్‌ మొదటి వారానికి సంబంధించి బార్క్‌ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో గతేడాదితో పోల్చితే వివిధ వయసుల వారీగా 15-21 గ్రూప్‌లో 38 శాతం, 22-30 గ్రూపులో 33 శాతం. 31-40 గ్రూపులో 32 శాతం మేర వీక్షకుల సంఖ్య తగ్గినట్టు తెలిపింది. రెండో వారం ఫలితాల్లో ఇది 40 శాతానికి చేరవచ్చని తెలిపింది. ఐపీఎల్‌ ప్రసార హక్కులను స్టార్‌టీవీ రూ.3,200 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్‌ ద్వారా రూ.4000 కోట్ల రెవెన్యూ ఆశిస్తోంది. ఐపీఎల్‌లో 10 సెకన్ల యాడ్‌కి రూ.16.50 లక్షల ఫీజు వసూలు చేస్తోంది స్టార్‌.

చదవండి: ప్రచారంలో పీక్స్‌.. మొబైల్‌ కొంటే పెట్రోల్‌, నిమ్మకాయలు ఉచితం

మరిన్ని వార్తలు