హావెల్స్‌ రికార్డ్‌- అశోక్‌ లేలాండ్‌ అదుర్స్‌

3 Nov, 2020 13:13 IST|Sakshi

క్యూ2 (జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

చరిత్రాత్మక గరిష్టానికి హావెల్స్‌ ఇండియా

రూ. 50,000 కోట్లకు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌

అక్టోబర్‌లో వాహన అమ్మకాల జోరు

52 వారాల గరిష్టానికి చేరువలో అశోక్‌ లేలాండ్‌

3 నెలల్లో 72 శాతం ర్యాలీ చేసిన షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ హావెల్స్‌ ఇండియా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ అక్టోబర్‌ నెలలో అమ్మకాలు జోరందుకోవడంతో ఆటో రంగ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

హావెల్స్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో హావెల్స్‌ ఇండియా నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 325 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ. 2,452 కోట్లకు చేరింది. ఇబిటా 79 శాతం ఎగసి రూ. 421 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 6.7 శాతం బలపడి 17.2 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో హావెల్స్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 816 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 827 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడింది. తాజాగా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 51,000 కోట్లను అధిగమించింది.

అశోక్‌ లేలాండ్‌
ఈ అక్టోబర్‌ నెలలో అశోక్‌ లేలాండ్‌ 1 శాతం అధికంగా 9,989 వాహనాలను విక్రయించింది. ఇందుకు ఎల్‌సీవీలు, ట్రక్కుల విక్రయాలలో 14 శాతం నమోదైన వృద్ధి సహకరించింది. అయితే మధ్య, భారీస్థాయి వాహన విక్రయాలు 11 శాతం క్షీణించాయి. అయితే నెలవారీగా చూస్తే మొత్తం అమ్మకాల పరిమాణం 20 శాతం వృద్ధి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎల్‌సీవీలు, వాణిజ్య వాహనాలకు దేశీయంగా డిమాండ్‌ పెరుగుతున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో కంపెనీ 8,344 యూనిటన్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో అశోక్‌ లేలాండ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం బలపడి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 87.5కు చేరువైంది. గత మూడు నెలల్లో ఈ షేరు 72 శాతం ర్యాలీ చేయడం విశేషం!

మరిన్ని వార్తలు