హెచ్‌సీఎల్‌ ఉద్యోగులకు ఉచితంగా బెంజ్‌ కార్లు..!

21 Jul, 2021 20:29 IST|Sakshi

పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకుగాను ప్రోత్సాహాకాలను అందిస్తాయి. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తన కంపెనీ ఉద్యోగుల కోసం బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల కోసం భారీ బహుమతులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని టాప్‌ పెర్పామర్లకు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్‌ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని కంపెనీ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ అప్పారావు వీవీ పేర్కొన్నారు.  అట్రిష‌న్ విధానాన్ని నివారించేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రోత్సాహ‌కాలను అందిస్తాయి. 

రీప్లేస్‌మెంట్‌ హైరింగ్‌ కాస్ట్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండడంతో తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని వీవీ అప్పారావు పేర్కొన్నారు. జావా డెవలపర్‌ను ప్రస్తుతం ఇచ్చే ప్యాకేజ్‌లో హైర్‌ చేసుకోవచ్చు, కానీ క్లౌడ్‌ ప్రోఫెషనల్స్‌ను సేమ్‌ ప్యాకేజ్‌లపై హైర్‌ చేసుకోలేమని తెలిపారు.   హెచ్‌సీఎల్‌లో మంచి రిటెన్షన్‌ ప్యాకేజ్‌ ఉందని, ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతంలో 50 నుంచి 100 శాతం వరకు క్యాష్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ స్కీమ్‌తో సుమారు 10 శాతం మందికి కీలక నైపుణ్యాలు కల్గిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 22 వేల మందిని కొత్తగా ఉద్యోగులను హైర్‌ చేసేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా హెచ్‌సీఎల్‌ కంపెనీలో ఈ తైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్‌ గత త్రైమాసికం కంటే 1.9 శాతం పెరిగి 11.8 శాతంగా నమోదైంది.  

మరిన్ని వార్తలు