కోవిడ్‌-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు

25 May, 2021 14:24 IST|Sakshi

ఆర్థిక సాయం, వేతనం, ఆరోగ్య బీమా..      

కోవిడ్‌-19 వేళ కంపెనీల ఔదార్యం 

ఉద్యోగుల కుటుంబాలకు అండ 

పిల్లల చదువుల బాధ్యత స్వీకరణ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌-19 విపత్తు వేళ ఉద్యోగులు, వారి కుటుంబాలకు కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. వైరస్‌ బారినపడ్డ సిబ్బందికి టెలి హెల్త్‌కేర్, వ్యాక్సినేషన్, వైద్యానికయ్యే ఖర్చుల చెల్లింపు, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతోపాటు కోవిడ్‌–19 కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఒక అడుగు ముందుకేశాయి. కోవిడ్‌–19తో ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి మేమున్నామంటూ పెద్ద మనసుతో ముందుకొస్తున్నాయి. ఆర్థిక సాయం, వేతనం చెల్లించడంతోపాటు కుటుంబ సభ్యులకు కొన్నేళ్లపాటు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాయి. ఆధారపడ్డ పిల్లల చదువు పూర్తి అయ్యే వరకు ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నాయి. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కంపెనీలు ఎలాంటి సాయం చేస్తున్నాయంటే.. 

టాటా స్టీల్‌: బాధిత కుటుంబం/నామినీకి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వేతనం, వైద్యం, హౌజింగ్‌ సౌకర్యం. పిల్లల గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యే వరకు సాయం. 
సన్‌ ఫార్మా: రెండేళ్ల వేతనం, పిల్లల గ్రాడ్యుయేషన్‌ అయ్యే వరకు ఆర్థిక తోడ్పాటు. 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌: ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా. ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తాన్ని కుటుంబానికి చెల్లింపు. ఒక ఏడాదికి సమానమైన వేతనం. 
అమెజాన్‌: వైరస్‌ బారినపడ్డ ఫ్రంట్‌లైన్‌ బృంద సభ్యుడు హోం క్వారంటైన్‌లో ఉంటే రూ.30,600ల గ్రాంట్‌. బీమా కవరేజ్‌ మించి ఆసుపత్రి బిల్లు అయితే అదనంగా రూ.1.9 లక్షల వరకు రీఇంబర్స్‌. 
బజాజ్‌ ఆటో: మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండేళ్ల వరకు ఆర్థిక మద్దతు. పిల్లల గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యే వరకు సాయం. కుటుంబ సభ్యులందరికీ అయిదేళ్లపాటు ఆరోగ్య బీమా. 
టెక్‌ మహీంద్రా: కోవిడ్‌ సపోర్ట్‌ పాలసీ కింద అదనపు ప్రయోజనాలు. అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు. నైపుణ్య శిక్షణ. 12వ తరగతి వరకు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తారు. 
బజాజ్‌ అలియాంజ్‌: బీమాకు అదనంగా రూ.1 కోటి వరకు ఆర్థిక సాయం. గ్రాడ్యుయేషన్‌ అయ్యే వరకు ఇద్దరు పిల్లలకు ఏటా రూ.2 లక్షల వరకు చెల్లింపు. అయిదేళ్ల వరకు ఆరోగ్య బీమా. 
సీమెన్స్‌: రూ.25 లక్షల ఆర్థిక సాయం. ఒక ఏడాది వేతనం. ఆరోగ్య బీమా, పిల్లల చదువుకు తోడ్పాటు. 
మహీంద్రా అండ్‌ మహీంద్రా: అయిదేళ్లపాటు వేతనం. రెండింతల వార్షిక పరిహారం. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏటా చెరి రూ.2 లక్షల వరకు చెల్లింపు. 
టీవీఎస్‌ మోటార్‌: గరిష్టంగా మూడింతల వార్షిక స్థూల వేతనం చెల్లింపు. ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ అదనం. మూడేళ్లపాటు ఆరోగ్య బీమా. ఇద్దరు పిల్లలకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు విద్య. 
ఓయో: ఎనమిది నెలల వేతనం, మూడేళ్ల వార్షిక వేతనానికి సమానమైన టెర్మ్‌ ఇన్సూరెన్స్‌. అయిదేళ్లపాటు పిల్లల చదువు. అయిదేళ్లపాటు రూ.3 లక్షల వరకు ఆరోగ్య బీమా. 
బోరోసిల్‌: రెండేళ్లపాటు వేతనం, పిల్లల చదువుకు తోడ్పాటు. 
ముతూట్‌ ఫైనాన్స్‌: మూడేళ్లకుపైగా పనిచేసిన ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రెండేళ్ల వేతనం చెల్లిస్తారు. మూడేళ్లలోపు ఉంటే ఒప్పంద ఉద్యోగులకూ ఒక ఏడాది వేతనం ఇస్తారు. అదనంగా వన్‌ టైం చెల్లింపు సైతం ఉంది. 
సొనాలికా: డీలర్లు, వారి ఉద్యోగుల కోవిడ్‌–19 చికిత్స కోసం రూ.25,000 వరకు వైద్య ఖర్చులు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.50 వేల వార్షిక వైద్య, విద్య ఖర్చులకు ఇది అదనం. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.2 లక్షల సాయం.

చదవండి:

అలర్ట్: జూన్​ 30లోగా ఎఫ్​డీ దారులు ఈ ఫామ్​లు నింపాల్సిందే

మరిన్ని వార్తలు