హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం జూమ్‌

22 Apr, 2022 06:33 IST|Sakshi

క్యూ4లో రూ. 3,593 కోట్లు

షేరుకి రూ. 18 మధ్యంతర డివిడెండ్‌

మొత్తం ఆదాయం 15 శాతం అప్‌

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల రంగ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం హైజంప్‌ చేసి రూ. 3,593 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,102 కోట్లు ఆర్జించింది. ఇందుకు వివిధ విభాగాలు, సర్వీసులకు నెలకొన్న భారీ డిమాండ్‌ సహకరించినట్లు కంపెనీ పేర్కొంది.

త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.4 శాతం అధికంకాగా.. వార్షికంగా మొత్తం ఆదాయం 15 శాతం ఎగసి రూ. 22,957 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 575 కోట్లు వన్‌టైమ్‌ బోనస్, రూ. 1,222 కోట్లమేర వాయిదాపడిన పన్ను చెల్లింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రస్తావించింది. వీటిని పరిగణిస్తే ప్రస్తుత సమీక్షా కాలంలో నికర లాభం 24 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది.  

ఇతర హైలైట్స్‌
► స్థిర కరెన్సీ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో 12–14 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది.
► వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది.  
► గతేడాది 40,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. సిబ్బంది సంఖ్య 2,08,877కు చేరింది.
► క్యూ4లో నికరంగా 11,100 మందికి ఉపాధిని కల్పించింది.  
► మార్చికల్లా ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 21.9 శాతంగా నమోదు.
► క్యూ4లో 226 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది.
► పూర్తి ఏడాదికి నికర లాభం 11,145 కోట్ల నుంచి రూ. 13,499 కోట్లకు ఎగసింది.  
► 2021–22లో మొత్తం ఆదాయం రూ. 75,379 కోట్ల నుంచి రూ. 85,651 కోట్లకు పెరిగింది.

ప్రోత్సాహకరంగా..  
మార్కెట్‌ వాతావరణం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. వివిధ విభాగాలు, సర్వీసులకు పటిష్ట డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి సర్వీసుల బిజినెస్‌లో మరోసారి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను సాధించాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో 17.5% వృద్ధిని అందుకున్నాం.
– సి.విజయ్‌ కుమార్, సీఈవో, ఎండీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.

ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు  1.2% బలపడి రూ. 1,102 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు