విడుదలైన క్యూ1 ఫలితాలు,వేల కోట్ల లాభాలతో పుంజుకున్న హెచ్‌పీసీఎల్‌!

13 Jul, 2022 07:32 IST|Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (క్యూ1) నికర లాభం 2.4% పుంజుకుని రూ.3,283 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మరింత అధికంగా 17 శాతం ఎగసి రూ. 23,464 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం స్థాయిలో వృద్ధి చూపగలదని కంపెనీ తాజాగా అంచనా(గైడెన్స్‌) వేసింది. కరెన్సీలో నిలకడ ప్రాతిపదికన గైడెన్స్‌ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. 

డీల్స్‌ జోరు: ప్రస్తుత ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో, ఎండీ సి.విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తంగా 2.7 శాతం వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. సర్వీసుల బిజినెస్‌ వార్షికంగా 19 శాతం పురోగతిని సాధించినట్లు వెల్లడించారు. డిజిటల్‌ ఇంజనీరింగ్, అప్లికేషన్ల సర్వీసులు, క్లౌడ్‌ వినియోగం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు వివరించారు.

భారీ, మధ్యతరహా డీల్స్‌తో కొత్త బుకింగ్స్‌ 23.4 శాతం అధికంగా 2.04 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. 17 శాతం నిర్వహణా మార్జిన్లను సాధించగా.. 6,023 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నట్లు  తెలియజేశారు. గతేడాది క్యూ4లో ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 21.9% కాగా.. తాజాగా 23.8 శాతానికి పెరిగింది. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు దాదాపు 2% క్షీణించి రూ. 926 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు