హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 18% అప్‌

17 Oct, 2020 05:15 IST|Sakshi

క్యూ2లో రూ. 3,142 కోట్లు

రూ. 4 మధ్యంతర డివిడెండ్‌

ద్వితీయార్ధంలో 9 వేల మంది ఫ్రెషర్ల నియామకాలు

న్యూఢిల్లీ: వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్‌ వెల్లడించారు.

త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్‌ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్‌ టెక్‌ గైడెన్స్‌ ఇచ్చింది. హెచ్‌–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని  తెలిపారు.

షేరు డౌన్‌..: లాభాల స్వీకరణతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్‌ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్‌ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్‌ఎస్‌ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 7.23 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి.

వేతనాల పెంపు..
అక్టోబర్‌ 1, జనవరి 1 నుంచి వర్తించేలా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్‌ చెప్పారు. కరోనా వైరస్‌ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది. దేశీయంగా ఉన్న ఉద్యోగులకు గతేడాది తరహాలోనే సగటున 6 శాతం స్థాయిలో పెంపు ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్‌ను కంపెనీ రిక్రూట్‌ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సుమారు 7,000 నుంచి 9,000 వేల మంది దాకా ఫ్రెషర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ అప్పారావు వీ తెలిపారు. క్యూ1, క్యూ2లో 3,000 మంది దాకా ఫ్రెషర్లను తీసుకున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు