హెచ్‌సీఎల్‌ టెక్‌.. క్యూ3 కిక్‌!

16 Jan, 2021 03:13 IST|Sakshi

నికర లాభం 31 శాతం అప్‌

రూ. 19,302 కోట్లకు ఆదాయం

2020లో తొలిసారి 10 బిలియన్‌ డాలర్ల ఆదాయం

షేరుకి రూ.4 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 3,982 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 31 శాతం అధికంకాగా.. డిజిటల్, ప్రొడక్టుల విభాగంలో పటిష్ట వృద్ధి ఇందుకు సహకరించింది. క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో యూఎస్‌గాప్‌ ప్రమాణాల ప్రకారం మొత్తం ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లను తాకింది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం తొలుత వేసిన 1.5–2.5 శాతం అంచనాలను మించుతూ 3.5 శాతం బలపడింది. ఈ బాటలో క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఆదాయం 2–3 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు అంచనా వేసింది. వెరసి గతంలో ఇచ్చిన 1.5–2.5 శాతం గైడెన్స్‌ను ఎగువముఖంగా సవరించింది.  

కొత్త ఏడాది హుషారుగా...: త్రైమాసిక ప్రాతిపదికన డిసెంబర్‌ క్వార్టర్‌లో పటిష్ట వృద్ధిని సాధించినట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈవో సి.విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. డీల్‌ పైప్‌లైన్‌లో కనిపిస్తున్న స్పీడ్‌ ప్రకారం రానున్న త్రైమాసికాలలో మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు తెలియజేశారు. తద్వారా కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించినట్లు వ్యాఖ్యానించారు. సొల్యూషన్లు, సర్వీసులపై దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ ప్రత్యేక తరహాలో వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి–డిసెంబర్‌ మధ్యకాలంలో తొలిసారి ఆదాయం 10 బిలియన్‌ డాలర్లను అధిగమించినట్లు తెలియజేశారు. స్థిరకరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా 3.6 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఏడు బిజినెస్‌ విభాగాల్లో ఐదు సానుకూల వృద్ధిని సాధించినట్లు వివరించారు. ప్రధానంగా యూరోప్‌లో మీడియా, టెలికం విభాగాలు పటిష్ట ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు.

20,000 మందికి  చాన్స్‌
వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించింది. క్యూ3లో 13 ట్రాన్స్‌ఫార్మేషనల్‌ డీల్స్‌ను కుదుర్చుకుంది. డిసెంబర్‌ క్వార్టర్‌లో నికరంగా 6,597 మందిని నియమించుకుంది. ఉద్యోగ వలస 10.2 శాతంగా నమోదైంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తాజాగా 1,59,682కు చేరింది. మార్చి క్వార్టర్‌లో 5,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు వెల్లడించింది. రానున్న రెండు త్రైమాసికాలలో 20,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు విజయ్‌ కుమార్‌ తెలియజేశారు.  ఐబీఎం డీల్‌ను పూర్తిచేసిన నేపథ్యంలో జూలై–డిసెంబర్‌ మధ్య కాలంలో 13.4 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. ఐబీఎం సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ను రూ. 12,252 కోట్లకు హెచ్‌సీఎల్‌ సొంతం చేసుకున్న విషయం విదితమే.

క్యూ3 ఫలితాలు, మార్కెట్లలో అమ్మకాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4% పతనమై రూ. 989 వద్ద ముగిసింది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు