హెచ్‌సీఎల్‌ టెక్‌ క్యూ3 భళా 

13 Jan, 2023 08:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 4,096 కోట్లను తాకింది.

గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,442 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం పుంజుకుని రూ. 26,700 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 22,331 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు రికార్డ్‌ డేట్‌ ఈ నెల 20.  

డీల్స్‌ ప్లస్‌ 
క్యూ3లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికరంగా 2,945 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,22,270కు చేరింది. ఈ కాలంలో 17 భారీ డీల్స్‌ను పొందింది. కొత్త డీల్స్‌ విలువ గత క్యూ3తో పోలిస్తే 10% అధికంగా 234.7 కోట్ల డాలర్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది.

క్యూ2తో పోలిస్తే ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 23.8% నుంచి 21.7 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది.  ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు 1.7 శాతం బలపడి రూ. 1,073 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు