హెచ్‌సీఎల్‌ టెక్‌ రికార్డ్‌- జీవోసీఎల్‌ జోరు

21 Sep, 2020 11:45 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఐటీ కంపెనీ DWS కొనుగోలు

సరికొత్త గరిష్టానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

యూకే కంపెనీ క్వేకర్‌ హాటన్‌లో వాటా విక్రయం

14 శాతం దూసుకెళ్లిన జీవోసీఎల్‌ కార్పొరేషన్‌

సరిహద్దు వద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. ఐటీ సర్వీసుల ఆస్ట్రేలియన్‌ కంపెనీ డీడబ్ల్యూఎస్‌ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు యూకే అనుబంధ సంస్థ ద్వారా క్వేకర్‌ హాటన్‌ కంపెనీలో 2 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు పేర్కొనడంతో లూబ్రికెంట్స్‌ దిగ్గజం జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
ఐటీ సర్వీసుల ఆస్ట్రేలియన్‌ కంపెనీ డీడబ్ల్యూఎస్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు 15.82 కోట్ల డాలర్లు(రూ. 1160 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తికావచ్చని తెలియజేసింది. ఐటీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సేవల కంపెనీ డీడబ్ల్యూఎస్‌.. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లలో సర్వీసులను అందిస్తున్నట్లు వివరించింది. తద్వారా ఆయా ప్రాంతాలలో సాఫ్ట్‌వేర్‌ సేవల విస్తరణకు వీలు కలగనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు తొలుత ఎన్‌ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 850 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 844 వద్ద ట్రేడవుతోంది.

జీవోసీఎల్‌ కార్పొరేషన్‌
యూకే అనుబంధ సంస్థ హెచ్‌జీహెచ్ఎల్‌ హోల్డింగ్స్‌ ద్వారా క్వేకర్‌ హాటన్‌ కంపెనీలో 2 లక్షల షేర్లను విక్రయించేందుకు నిర్ణయించినట్లు జీవోసీఎల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. క్వేకర్‌ కెమికల్‌ కార్పొరేషన్‌లో 4.27 లక్షల షేర్లను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. షేరుకి 175 డాలర్లలో 2 లక్షల షేర్లను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. తద్వారా రూ. 257 కోట్లు సమకూరగలవని తెలియజేసింది. వీటికి పన్ను వర్తించదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీవోసీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 210ను తాకింది. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 204 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా