హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనానికి గ్రీన్‌సిగ్నల్‌!

4 Jul, 2022 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనానికి  స్టాక్ ఎక్ఛేంజ్‌లు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానున్న ఈ విలీనానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ..నో అబ్జక్షన్‌ను మంజూరు చేశాయి. అయితే విలీనానికి వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది.

రిజర్వ్‌ బ్యాంక్, కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)తోపాటు.. రెండు సంస్థల వాటాదారులు, రుణదాతలు ఆమోదించవలసి ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 4న దేశీయంగా అతిపెద్ద మార్టిగేజ్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకునేందుకు బ్యాంక్‌ బోర్డు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

విలీన సంస్థ 40 బిలియన్‌ డాలర్ల విలువైన ఫైనాన్షియల్‌ రంగ దిగ్గజంగా ఆవిర్భవించనుంది. విలీన సంస్థ ఆస్తుల విలువ(అసెట్‌ బేస్‌) రూ. 18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం 2023–24 మూడో త్రైమాసికానికల్లా పూర్తి కావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒప్పందంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకుగాను 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లభించనున్నాయి. 
 

మరిన్ని వార్తలు