రుణ రేట్లకు రెక్కలు

9 May, 2022 00:40 IST|Sakshi

0.30% పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

ఇండియన్‌ బ్యాంకు 0.40% పెంపు

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ (రుణాలు) రేట్లను 30 బేసిస్‌ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈ మేరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వరంగ ఇండియన్‌ బ్యాంకు సైతం 0.40 శాతం రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.

దీనికంటే ముందు ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు ప్రకటించడాన్ని గమనించాలి. అనూహ్యంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు గత వారం ప్రకటించడం తెలిసిందే. అలాగే, సీఆర్‌ఆర్‌ను 0.50 శాతం పెంచింది. రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (ఆర్‌పీఎల్‌ఆర్‌)ను గృహ రుణాలపై 30 బేసిస్‌ పాయింట్లు పెంచినట్టు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

కొత్తగా రుణాలు తీసుకునే వారికి 7% నుంచి 7.45 శాతం మధ్య రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి 0.30 శాతం పెంపు అమలవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఈ సంస్థ 6.70–7.15% మధ్య రేట్లను అమలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ తన రుణాలకు మూడు నెలల సైకిల్‌ను అమలు చేస్తుంటుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణాలపై రేట్లు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా సవరణకు గురవుతుంటాయి.

ఇండియన్‌ బ్యాంకు పెంపుబాట..  
ఇండియన్‌ బ్యాంకు రెపో అనుసంధానిత లెండింగ్‌ రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రెపో రుణాల రేట్లు ఆర్‌బీఐ రెపో రేటును సవరించిన ప్రతిసారీ మార్పునకు లోనవుతాయి. ‘‘బ్యాంకు అస్సెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ రెపో రేటుకు లింక్‌ అయిన అన్ని రుణాల రేట్లను సమీక్షించింది. రెపో రేటును 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది’’అని ఇండియన్‌ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు