రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ.. ఈ బ్యాంకుల్లో ఎంతంటే?

10 Jun, 2022 08:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెపో రేటు పెంపు మరుసటి రోజే రుణాలపై రేట్లను సవరిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ) నిర్ణయం తీసుకున్నాయి. గృహ రుణాల అతిపెద్ద సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ గృహ రుణాలకు సంబంధించి తన రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును అరశాతం పెంచింది. ఈ నిర్ణయం జూన్‌ 10 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐవోబీ కూడి ఇదేవిధమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ‘‘రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటును 7.75 శాతానికి పెంచామని, జూన్‌ 10 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆర్‌బీఐ రెపో 4.90 శాతానికి బ్యాంకు మార్జిన్‌ రేటు 2.85% కలసి ఉంది. ఇక ఆర్‌బీఐ పాలసీ ప్రకటన రోజే పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా రుణాల రేట్లను అరశాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  

డిపాజిట్‌ రేట్ల పెంపు
కోటక్‌ మహీంద్రా బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాదారులకు అనుకూలించే నిర్ణయాన్ని తీసుకుంది. రూ.50లక్షలకు పైన బ్యాలన్స్‌ ఉండే సేవింగ్స్‌ ఖాతాలకు వడ్డీ రేటును అరశాతం పెంచి 4 శాతం చేసినట్టు తెలిపింది. టర్మ్‌ డిపాజిట్ల రేట్లను పావు శాతం పెంచినట్టు పేర్కొంది. 
 

చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్‌ ఎలా?

>
మరిన్ని వార్తలు